ప్రశాంతంగా ఉండండి నాన్న: సింగర్‌ భావోద్వేగం

Arjun Kanungo Emotional Note After Father Passed Away - Sakshi

‘‘మళ్లీ మనం కలుసుకునేంత వరకు.. ప్రశాంతంగా ఉండండి నాన్న’’అంటూ ప్రముఖ సింగర్‌, నటుడు అర్జున్‌ కనుంగో భావోద్వేగానికి లోనయ్యాడు. బాల్యంలో తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసి.. ఆయనను మిస్సవుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడుతున్న అర్జున్‌ తండ్రి బుధవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ విషాదకర వార్త బయటకు వచ్చింది. ఈ క్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు అర్జున్‌ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ.. విషాద సమయాల్లో మరింత ధైర్యంగా నిలబడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా అతడిని ఓదార్చారు. గాయకులు దర్శన్‌ రావల్‌, జోనితా గాంధీ, విశాల్‌ మిశ్రా ఈ మేరకు ట్వీట్లు చేశారు. (కుల్మీత్‌ మక్కర్‌ మృతి;  విద్యాబాలన్‌ దిగ్ర్బాంతి)

కాగా బాకీ బాతే పీనే బాద్‌, ఆయా నా తూ అండ్‌ హోనా చైదా వంటి పాటలతో 29 ఏళ్ల అర్జున్‌ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. న్యూయార్క్‌లోని లీ స్ట్రాబెర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకున్న అర్జున్‌.. సల్మాన్‌ ఖాన్‌ రాధే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయం గురించి గతంలో ఓ మీడియాతో మాట్లాడిన ఈ యువ నటుడు.. సల్మాన్‌ వంటి మోగాస్టార్లతో కలిసి నటించడం ద్వారా తన కల నిజమైందని హర్షం వ్యక్తం చేశాడు. రాధే మూవీలో ఆఫర్‌ వచ్చిన నాటి నుంచి కొన్ని రాత్రుల పాటు ఆనందంతో నిద్ర కూడా పట్టలేదని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 వేసవికి విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాధే థియేటర్లలోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. (దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top