నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటా! | Amyra Dastur About Her Dubbing | Sakshi
Sakshi News home page

నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటా!

Jun 10 2019 11:40 AM | Updated on Jun 10 2019 11:40 AM

Amyra Dastur About Her Dubbing - Sakshi

తమిళసినిమా: బాలీవుడ్‌ నటి అమిరా దస్తూర్‌ గుర్తుందా? ఆ మధ్య ధనుష్‌కు జంటగా అనేగన్‌ చిత్రంతో నాయకిగా నటించిది. దక్షిణాది చిత్రంలో నటిస్తున్నప్పుడు నన్ను చాలా కష్టపెట్టారంటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది కూడా. ఇప్పుడు గుర్తుకొచ్చే ఉంటుంది. అందాలారబోతకుసై అంటున్నా, అవకాశాలు అంతంత మాత్రంగానే రాబట్టుకుంటోందీ బ్యూటీ. అలా హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. నటుడు సంతానం సరసస ఓడి ఓడి ఒళైక్కనుమ్‌ చిత్రంతో పాటు డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతోనూ ఒక చిత్రంలో రొమాన్స్‌ చేసే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. అంతే కాదు తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానంటోందట ఈ అమ్మడు. దీని గురించి అమిరా దస్తూరి తెలుపుతూ సంతానంకు జంటగా నటిస్తున్న ఓడి ఓడి ఒళైక్కనుమ్‌ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని చెప్పింది.

ప్రస్తుతం ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ప్రభుదేవాతో కలిసి నటిస్తున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఇది యాక్షన్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో తనది చాలా బలమైన పాత్ర అని తెలిపింది. ఆ పాత్రకు తానే డబ్బింగ్‌ చెబితే జీవం ఉంటుందని అనిపించిందంది. అందుకే తానే డబ్బింగ్‌ చెప్పాలని భావించానని చెప్పింది. అందుకే తమిళ భాషను నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానని, ఈ చిత్రమే కాకుండా ఇకపై నటించే అన్ని చిత్రాలకు తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటానని చెప్పింది. అంతా బాగానే ఉంది గానీ సడన్‌గా ఆ డబ్బింగ్‌ చెప్పుకోవాలన్న కోరిక ఎందుకొచ్చిందమ్మడూ అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు. అసలే అవకాశాలు అరకొరగానే వస్తున్నాయి. దీంతో అవకాశాలను పెంచుకునేందుకే ఈ డబ్బింగ్‌ అంశాన్ని ముందుకు తీసుకొస్తోందా? అయినా ఈ జాణ డబ్బింగ్‌ చెబుతానన్నా, దర్శక నిర్మాతలు సరే అనాలిగా! చూద్దాం అమిరా దస్తూర్‌ డబ్బింగ్‌ ట్రిక్స్‌ ఏ మాత్రం పనిచేస్తుందో!

Advertisement
 
Advertisement
Advertisement