
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఝండ్’. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కాపీరైట్స్ నావంటూ తెలుగు పరిశ్రమకు చెందిన చిన్నికుమార్ మీడియా ముందుకు వచ్చాడు. తాను గతంలో రిజిస్టర్ చేసుకున్న సినిమాను కాపీ కొట్టారంటూ ఝండ్ టీంపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు బిగ్‌బీకి, దర్శకుడు, నిర్మాత నాగరాజు ముంజులకు నోటీసులు పంపించాడు. అయితే దీనిపై వారు ఏమాత్రం స్పందించట్లేదని ఆయన వాపోయాడు. వీరితోపాటు నిర్మాత క్రిష్ణన్ కుమార్, టీ-సిరీస్ చైర్మన్ భూషణ్ కుమార్, స్లమ్ సాకర్ వ్యవస్థాపకుడు విజయ్ బార్సేలకు నోటిసులు అందించాడు.
ఈ విషయంపై చిన్నికుమార్ మాట్లాడుతూ.. ఝండ్ చిత్రబృందానికి నోటీసులు అందాయని, కానీ టీసిరీస్ మాత్రమే దీనిపై స్పందించిందన్నారు. వారి సమాధానం అస్పష్టంగా ఉందని చెప్పుకొచ్చాడు. అవసరమైతే ఈ సినిమాను నిలిపివేయడానికి కోర్టుకు వెళ్లడానికి సిద్ధమన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఝండ్ సినిమాను అడ్డుకుని తీరుతానని చిన్నికుమార్ స్పష్టం చేశాడు.
వివాదమేంటంటే..
ఝండ్ చిత్రం ప్రధానంగా స్లమ్ సాకర్‌ను స్థాపించిన విజయ్ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది.విజయ్ బార్సే.. స్లమ్ సాకర్ వరల్డ్‌కప్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన అఖిలేశ్ పౌల్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఇతని పాత్ర సినిమాలో ఎంతో కీలకమైనది. మరోవైపు తెలుగు నిర్మాత చిన్నికుమార్ ఈపాటికే అఖిలేశ్ పౌల్ బయోగ్రఫీని తెరకెక్కించడానికి హక్కులు కొన్నాడని పేర్కొంటున్నాడు. 2018లోనే దీనికి సంబంధించిన కథను రిజిస్టర్ చేయించుకున్నాని తెలిపాడు. ఇప్పుడు దీనిపై నోరు విప్పినందుకు నాగరాజు సెటిల్‌మెంట్ చేసుకుందామంటూ బలవంతపెడుతున్నాడని చెప్పుకొచ్చాడు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు.