‘గాడ్‌ఫాదర్’ నటుడి కన్నుమూత | Alex Rocco, mobster Moe Greene in 'The Godfather,' dies at 79 | Sakshi
Sakshi News home page

‘గాడ్‌ఫాదర్’ నటుడి కన్నుమూత

Jul 21 2015 12:20 AM | Updated on Apr 3 2019 8:07 PM

‘గాడ్‌ఫాదర్’ నటుడి కన్నుమూత - Sakshi

‘గాడ్‌ఫాదర్’ నటుడి కన్నుమూత

హాలీవుడ్ నటుడు అలెక్స్ రొకో (79) శనివారం లాస్ ఏంజెలెస్ సమీపంలో స్టూడియో సిటీలోని తన నివాసంలో కన్నుమూశారు.

 హాలీవుడ్ నటుడు అలెక్స్ రొకో (79) శనివారం లాస్ ఏంజెలెస్ సమీపంలో స్టూడియో సిటీలోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా మాఫియా సినిమాలకు మాతృకగా నిలిచిన ‘గాడ్‌ఫాదర్’లో కీలకమైన ‘మో గ్రీన్’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రొకో ప్రశాంతంగా కన్నుమూసినట్లు ఆయన మేనేజర్ సుసాన్ జషరీ మీడియాకు వెల్లడించారు. 1965లో ‘మోటార్ సైకో’ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అలెక్స్ రొకో, ‘గాడ్‌ఫాదర్’ (1972) ఘనవిజయంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరచుకున్నారు.
 
  ‘గాడ్‌ఫాదర్’లో రొకో తన విలక్షణమైన గొంతుతో పలికిన ‘యూ డోంట్ బై మీ ఔట్.. ఐ బై యూ ఔట్.. అండ్ డూ యూ నో హూ ఐయామ్..?’ అనే డైలాగు ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ది ఫ్రెండ్స్ ఆఫ్ ఎడ్డీ కోయల్’, ‘ఫ్రీబీ అండ్ ద బీన్’, ‘దట్ థింగ్ యూ డూ’, ‘ఎ బగ్స్ లైఫ్’ వంటి చిత్రాల్లోనూ రొకో తన ప్రత్యేకతను చాటుకున్నారు. మెసచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో 1936 ఫిబ్రవరి 29న పుట్టిన రొకో, 1960లలో సదరన్ కాలిఫోర్నియాకు మకాం మార్చారు. సినిమాల్లోకి రాకముందు కొద్దికాలం బార్‌టెండర్‌గా పనిచేశారు. హాలీవుడ్ నటి శాండీ ఎలైన్ గారెట్‌ను 1966లో పెళ్లాడారు. ఆమె 2002లో మరణించిన తర్వాత నటి షానన్ విల్‌కాక్స్‌ను పెళ్లాడారు. రొకోకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement