
అంతా సెట్ చేసుకున్నారు. ఇక సెట్‌లోకి ఎంటర్ కావడమే ఆలస్యం. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఇప్పటివరకు కియారా అద్వానీ, రష్మికా మండన్నాల పేర్లు వినిపించాయి. మరో వారంలో కథానాయికగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై అధికారిక ప్రకటన రావొచ్చని తెలిసింది. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండో వారంలో మొదలు కానుందని సమాచారం.
అందమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ హంగులను జోడించి సినిమాలు తీస్తుంటారు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. పరుగు, ఆరెంజ్ అలాంటి చిత్రాలే. ప్రస్తుతం అఖిల్‌తో చేయబోతున్న స్క్రిప్ట్ కూడా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుందట. ఒకవైపు భాస్కర్ కథ రెడీ చేస్తుంటే మరోవైపు ఇతర ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. పర్ఫెక్ట్ ప్లాన్‌తో జూన్‌లో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించనున్నారు.