ఉడీ ఉగ్రదాడులపై నోరువిప్పిన పాక్ నటి | Sakshi
Sakshi News home page

ఉడీ ఉగ్రదాడులపై నోరువిప్పిన పాక్ నటి

Published Sun, Oct 9 2016 3:06 PM

ఉడీ ఉగ్రదాడులపై నోరువిప్పిన పాక్ నటి - Sakshi

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉడీ ఉగ్రదాడులపై పాకిస్తాన్ ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. తొలుత ఫవాద్ ఖాన్ ఉడీలో జరిగిన ఉగ్రదాడులను ఖండించగా.. ప్రస్తుతం పాకిస్తాన్ నటి మహీరాఖాన్ సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనను వ్యతిరేకించింది. ఉడీలో పాక్ ఉగ్రదాడులు, అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించారు. మొదట ఫవాద్ ఖాన్ స్పందిస్తూ.. తన భార్యకు డెలివరీ ఉందని తాను మూడు నెలలుగా పాక్ లోనే ఉన్నానని, అయితే ఉగ్రదాడులు ఏ దేశం చేసినా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పాడు.

భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఉన్నా ఒప్పుకుంటారు కానీ ఉగ్రదాడులు జరిగే ప్రాంతాల్లో ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరని మహీరాఖాన్ తెలిపింది. ఇరుదేశాలు శాంతిని పాటించాలని, ఉగ్రదాడుల వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. గత ఐదేళ్లుగా నటిగా కొనసాగుతున్న తాను పాక్ గౌరవానికి భంగం వాటిల్లేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొంది. ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'రాయిస్‌' సినిమాతో పాక్ నటి మహీరాఖాన్ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో 'రాయిస్' మూవీ షూటింగ్ మధ్యలోనే మహీరా  పాక్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’  చిత్రంపై పాకిస్తాన్ లో ఇదివరకే ఆంక్షలు మొదలయ్యాయి. షారుఖ్ ఖాన్, మహీరా ఖాన్ జంటగా నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్తాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తుండగా.. సన్నీలియోన్, షారుక్ పై చిత్రీకరించిన ఆ ఐటం పాటపై పాక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో అక్కడ ఈ పాటను కట్ చేసి మూవీ రిలీజ్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement