నటి మూడో పెళ్లిపై విమర్శలు; పోలీసులకు ఫిర్యాదు

Actress Vanitha complains about producer - Sakshi

చెన్నై : సినీ నిర్మాత రవీంద్రన్‌పై నటి వనిత విజయకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇటీవలే పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆమెపై పలువురు విమర్శల దాడి చేస్తున్నారు. వనిత పెళ్లి అన్నది ఆమె వ్యక్తిగత విషయమైనప్పటికీ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ఆమెపై విమర్శలు దాడి కొనసాగిస్తున్నారు. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, కస్తూరి, నిర్మాత రవీంద్రన్‌ వంటి వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నటి వనిత వారికి ట్విట్టర్‌ ద్వారానే గట్టిగానే బదులిచ్చారు. అయినా ఆమెపై విమర్శలు ఆగకపోవడంతో వనిత మంగళవారం సాయంత్రం తన న్యాయవాదితో కలిసి స్థానిక పోరూర్‌ పోలీస్‌ స్టేషన్లో నిర్మాత రవీంద్రన్, అదేవిధంగా సూర్యదేవిపైన ఫిర్యాదు చేశారు.

నటి వనిత మూడో పెళ్లి చేసుకోవడంపై సూర్యదేవి అనే మహిళ తీవ్రంగా విమర్శిస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. దాంతో వారిపై వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కొన్ని వారాలుగా మీడియాలో తన గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, సూర్యదేవి అనే మహిళ తన గురించి హద్దులు మీరి అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత రవీంద్రన్‌ సైతం తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం తనను మానసికంగా వేదనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలతో తాను జీవితం కొనసాగిస్తున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో తోడు కోసం మరో పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని తాను చట్టపరంగా ఏదుర్కొంటానని చెప్పింది. తన ఫిర్యాదుపై పోలీసులు ఒకటి రెండు రోజుల్లో సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని నటి వనిత అన్నారు. ( ఈమె మూడో పెళ్లి కూడా.. )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top