బరువుతో రండి.. | actress Kajal Agarwal manhandled during film shoot? | Sakshi
Sakshi News home page

బరువుతో రండి..

Jun 15 2016 2:54 AM | Updated on Apr 3 2019 9:11 PM

బరువుతో రండి.. - Sakshi

బరువుతో రండి..

బరువుతో రండి అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ఏమిటీ బరువు అనగానే పారితోషికం లాంటివేవో...

బరువుతో రండి అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్.  ఏమిటీ బరువు అనగానే పారితోషికం లాంటివేవో అనే నిర్ణయానికి వచ్చేయకండి. బరువుతో అంటే పాపం కాజల్ భావన బరువైన పాత్రలతో రండని. ఎందుకంటే అలాంటి పాత్రలామెను ఇంత వరకూ వరించలేదు.అయినా కాజల్ బాధ పడలేదు తనకు లభించిన అందాలారబోతలతో కూడిన ప్రేమ పాత్రలతో కాలాన్ని నెట్టుకుంటూ వచ్చారు. తెలుగులో ఘన విజయం సాధించిన మగధీర, తమిళంలో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాల్లోనూ కాజల్ హీరోను ప్రేమించడం, పాటలు పాడుకోవడం లాంటి పాత్రలకే పరిమితమయ్యారు.

అలా అందాలతోనే నటిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చిన ఈ బ్యూటీని పెద్దగా విమర్శలు దరిచేరలేదు. అయితే ఇటీవల హిందీ చిత్రంలో నటించిన ఘాటు లిప్‌లాక్ సన్నివేశం మాత్రం పెద్ద కలకలానికే దారి తీసింది. అయినా ఆ చిత్రం కాజల్‌అగర్వాల్ కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ అవలేదు. అదటుంచితే తాజాగా తన సహనటీమణుల నటనా ప్రభావం ఈ అమ్మడికి నిద్ర పట్టనీయడం లేదని సమాచారం. విషయం ఏమిటంటే అనుష్క, నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు కథల్లో లీడ్ పాత్రల్ని పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.

తను మాత్రం ఇంకా ప్రేమా, దోమ లాంటి పాత్రల చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో తనకు లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించాలనే ఆసక్తి కలుగుతోందట. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను పోషించాలని ఆశపడుతున్నారట. ఇటీవల తనకు కథలు చెప్పడానికి వస్తున్న దర్శకులు వినిపించే కథలు పూర్తిగా ఆలకించి చివరికి అందులో హీరోయిన్ పాత్రలు తన స్థాయికి తగ్గట్టుగా లేవు. కొత్తగా వచ్చే హీరోయిన్లకు ఈ తరహా పాత్రలు బాగుంటాయి. అయినా ఇలాంటి పాత్రలు తాను చాలా చేసేశాను. మళ్లీ మళ్లీ అవే చేయాలంటే బోర్ కొడుతోంది అని అంటున్నారట.

అంతే కాదు బరువైన పాత్రల్లో రండి అంటూ చిన్న ఉచిత సలహాను కూడా ఇచ్చేస్తున్నారట. దీంతో అనుష్క, త్రిష లాంటి హీరోయిన్లు కాజల్‌కు నప్పుతాయా? అంటూ వచ్చిన దర్శకులు గొనుక్కుంటూ తిరుగు ముఖం పడుతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విక్రమ్‌కు జంటగా గరుడా, జీవా సరసన కవలైవేండామ్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement