చట్రంలో చిక్కని నటుడు | Sakshi
Sakshi News home page

చట్రంలో చిక్కని నటుడు

Published Sun, Jan 4 2015 10:59 PM

చట్రంలో చిక్కని నటుడు - Sakshi

 ‘ఆహుతి’ ప్రసాద్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. ఎలాంటి ఇమేజ్ చట్రంలోనూ చిక్కుకోకుండా ఏ తరహా పాత్రలోనైనా ఇమిడిపోయిన నటుడు ఆయన. ముఖ్యంగా వాచికం విషయంలో చాలా శ్రద్ధ కనబరిచేవారు. గోదావరి యాసలో సంభాషణలు పలికించడంలో బాగా నేర్పు ప్రదర్శించేవారు. మీడియాతో ఇంటర్వ్యూలకు కొంత దూరంగానే ఉండేవారు. ‘ఆహుతి’ ప్రసాద్ కెరీర్‌లోని కొన్ని మలుపులు...
 
 ఆహుతి’ ప్రసాద్ ఒక సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశారు. ‘మల్లె మొగ్గలు’ చిత్రానికి సీనియర్ దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ఆ తర్వాత ‘విక్రమ్’లో  నటించే అవకాశం వచ్చింది.  దూరదర్శన్ కోసం ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు చేసిన ‘మీరూ ఆలోచించండి’ ప్రోగ్రామ్‌లో నటించారు.  సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఆంజనేయ శాస్త్రి ‘ఆంధ్రప్రభ’లో ఇంటర్వ్యూ రాస్తూ - ఇకపై ‘ఆహుతి’ ప్రసాద్‌గా పేరు తెచ్చుకుంటారని రాశారు. నిజంగానే అప్పట్నుంచీ ఆయన పేరు అదే అయిపోయింది. పేరులో ‘ఆహుతి’ వద్దని చాలామంది చెప్పినా, అప్పటికే ఆ పేరు ఆయనకు స్థిరపడిపోయింది.
 
  నిర్మాత ‘ఆహుతి’ ప్రసాద్ కన్నడంలో మూడు సినిమాలు చేశారు. ‘పోలీస్ భార్య’ను కన్నడంలో నటులు హరిప్రసాద్, రఘుబాబుతో కలిసి రీమేక్ చేస్తే, అక్కడ ఘనవిజయం సాధించింది. తర్వాత ‘మామాశ్రీ’ రీమేక్ చేశారు. కె. వాసు దర్శకత్వంలో ‘సర్వర్ సుందరం’ చేశారు. నిర్మాతగా ఎదురు దెబ్బలు తిని, స్థిరాస్తి వ్యాపారంతో మళ్లీ పుంజుకున్నారు. సత్యారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘నాయకురాలు’ సినిమాలో నాగబాబు, భానుచందర్, హరితో కలిసి హీరోగా చేశారు. ‘శారద’లో కైకాల సత్యనారాయణ చేసిన పాత్ర ఆయన డ్రీమ్ కారెక్టర్. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయలనుకున్నారు. ‘ఆహుతి’ ప్రసాద్ పెద్ద కుమారుడు భరణి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. రెండో కుమారుడు కార్తీక్ తండ్రి బాటలో సినిమాల్లోకి వచ్చారు. ‘రేస్’లో హీరోగా నటించారు. ప్రస్తుతం మరో చిత్రం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement