హీరో, హీరోయిన్లు కాదు.. కథే రాజు

Abhishek Nama Interview About Saakshyam Movie - Sakshi

‘‘ఇండియన్‌ ఫిలిం హిస్టరీలో మొదటిసారి పంచ భూతాల మీద వస్తున్న సినిమా ‘సాక్ష్యం’. తప్పు చేసినప్పుడు ఎవరూ చూడకుండా చేసాం, తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ, కర్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందనీ, దాని నుంచి తప్పించుకోవడం కుదరదనేది మా సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌’’ అని నిర్మాత అభిషేక్‌ నామా అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా  శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా పంచుకున్న విశేషాలు...

► ‘సాక్ష్యం’ కథని శ్రీవాస్‌గారు మొదట బెల్లంకొండ శ్రీనివాస్‌గారికి చెప్పారు. నిర్మాతగా నేను అయితే బాగుంటుందని వాళ్లు అనుకుని నన్ను కలిశారు. శ్రీవాస్‌ గత సినిమా ‘డిక్టేటర్‌’ ఎందుకో ఆ సమయంలో వర్కవుట్‌ కాలేదు. కానీ, ‘సాక్ష్యం’ కథ మీద నమ్మకంతోనే ఆయనతో ఈ సినిమా చేశా.

► ప్రజెంట్‌ జనరేషన్‌ మూవీస్‌లో హీరో, హీరోయిన్ల కంటే కథే మెయిన్‌ కింగ్‌.  సినిమాలో కాశీలో కొన్ని సీన్స్‌ ఉన్నాయి. వాటిని హైదరాబాద్‌లో తీయలేం కదా?. కష్టమైనా కాశీలోనే తీయాలి. అందుకే ప్రొడక్షన్‌ కాస్ట్‌ కొంచెం పెరిగింది.

► ‘సాక్ష్యం’ లో శ్రీనివాస్‌ వీడియో గేమ్‌ డిజైనర్‌గా నటిస్తున్నారు. హీరో మార్కెట్‌ పక్కన పెడితే మంచి కంటెంట్‌ ఉన్న సినిమాకి ఈ మాత్రం ఖర్చు కరెక్టే అనిపించింది. పెద్ద హీరోలని పెట్టి సినిమా తీసినా, సరైన కథ లేకపోతే ప్రేక్షకులు చూడరు కదా?

► తన సినిమాల్లో శ్రీవాస్‌ తొలిసారి హీరోని చాలా డిఫరెంట్‌గా చూపించారు. సాయి శ్రీనివాస్‌గారు కూడా లవ్‌ సీన్స్‌లో చాలా స్టైలిష్‌గా, ఫైట్‌ సీన్స్‌ అప్పుడు బాడీని బాగా బిల్డ్‌ అప్‌ చేసి నటించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ చక్కని సంగీతం అందించారు. కథకు తగ్గట్టు, సందర్భానుసారంగా పాటలు వస్తాయి. పాటలు చిత్రీకరించిన లొకేషన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి.

► మొత్తం 48మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. వారందరూ స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపిస్తారు. మా బ్యానర్‌కి ‘సాక్ష్యం’ చాలా ప్లస్‌ అవుతుంది. కొత్త కాన్సెప్ట్‌ కావడంతో తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top