ఇతరులపై బురద చల్లొద్దు!

2.0: Rajinikanth, Akshay Kumar starrer's audio launch is 2017's

దుబాయ్‌లోని బుర్జ్‌ అల్‌ అరబ్‌ టవర్స్‌ దగ్గర బుర్జ్‌ పార్క్‌ ప్రాంగణమంతా శుక్రవారం రాత్రి ఐదు నిమిషాల పాటు ప్రేక్షకుల ఈలలు, చప్పట్లతో మార్మోగింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన రోబోటిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘2.0’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోందక్కడ. సుమారు పన్నెండు వేలమంది వీక్షకుల్లో కొందరికి రజనీకాంత్‌ ఏం చెప్పారో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత పక్కవాళ్లను అడిగితే... జరిగిన సంగతి వివరించారు. మేటర్‌ ఏంటంటే... ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’– సూపర్‌స్టార్‌ తెలుగులో డైలాగ్‌ చెప్పారు.

రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘2.0’ పాటల్ని శుక్రవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ మొత్తం మూడు పాటలకు లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. అయితే.. మూడింటిలో సినిమాలో ఒక్కటే ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ... మూడు భాషల పాటల్నీ ఇదే కార్యక్రమంలో విడుదల చేశారు. తెలుగు ఆడియోకి హీరో రానా, తమిళ్‌కి ఆర్‌.జె. బాలాజీ, హిందీకి దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ వేడుకలో మిగతా ఇద్దరూ రజనీని ప్రశ్నలు అడగ్గా... ‘నేను ప్రశ్నలు అడిగేంతవాణ్ణి కాదు సార్‌. తెలుగువాళ్ల కోసం తెలుగులో ఒక్క డైలాగ్‌ చెప్పండి. మీరు ఏ డైలాగ్‌ చెప్పినా అందంగానే ఉంటుంది’ అని రానా కోరారు. అప్పుడు ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్‌ చెప్పారు. అనంతరం రజనీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘భగవంతుడి కృప–కరుణ, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇన్నేళ్లు నటుడిగా కొనసాగాను. కెరీర్‌ స్టార్టింగ్‌లో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు సంతోషాన్నిస్తాయి.

ఓ స్థాయికి వచ్చిన తర్వాత అవేవీ సంతోషాన్ని ఇవ్వవు. కానీ, వాటిని కావాలనుకుంటాం. అవి లేకుంటే దురదృష్టంగా భావిస్తాం. ఇలాంటివి తలచుకుంటే నవ్వొస్తుంది. ఇక, నా అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే... ఎవరి సినిమాకు ఎలాంటి టాక్‌ వచ్చినా, సోషల్‌ మీడియాలో ఆ సినిమాపై చెడు ప్రచారం చేయొద్దు. ఇతరులపై బురద చల్లొద్దు. ఇతరులపై బ్యాడ్‌ పబ్లిసిటీ కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించవద్దు. నేటి యువతరం మన సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించాలి. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరువడం విచారకరం’’ అన్నారు.

‘2.0’లో విలన్‌గా నటించిన హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో ఇతరుల ప్రతిభను గౌరవిస్తూ, అందరితో కలసి సమిష్టిగా వర్క్‌ చేస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. నేనెప్పుడూ ఇటువంటి గొప్ప, పెద్ద సినిమాలో నటించే చాన్స్‌ వస్తుందని ఊహించలేదు. రజనీతో నటించే ఈ చాన్స్‌ ఇచ్చిన శంకర్‌ సార్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు. దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ– ‘‘డిల్లీలో 40 డిగ్రీల టెంపరేచర్‌లో 12 కిలోల సూట్‌ వేసుకుని రజనీ సార్‌ ఎంతో ఉత్సాహంగా నటించారు.

అలాగే, ఓ సీన్‌ కోసం నాలుగు గంటలు భూమిలో పూడ్చిన బాక్సులో ఉన్నారు. ఆయన ఎనర్జీ మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమా కోసం ఆయన పడిన శ్రమ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఆయనెప్పుడూ ప్రయోగాలకు సిద్ధమే’’ అన్నారు.‘‘నా భర్తను చూస్తుంటే గర్వంగా ఉంది. ‘2.0’ కోసం ఆయన పడిన కష్టానికీ, చూపించిన అంకితభావానికీ సెల్యూట్‌’’ అన్నారు రజనీ సతీమణి లత. ఈ వేడుకలో ‘2.0’ హీరోయిన్‌ అమీ జాక్సన్, తెలుగు నిర్మాత డి. సురేశ్‌బాబు, రజనీ కుటుంబ సభ్యులు ధనుష్, ఐశ్వర్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top