బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్‌

threatening calls to Bjp mla prasad lad after Victory Celebrations - Sakshi

సాక్షి, ముంబై: బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్‌ లాడ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. కేసు నమోదుచేసిన స్థానిక సైన్‌ పోలీసులు అజ్ఞాత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీ రావడంతో ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్‌ లాడ్‌ సోమవారం సాయంత్రం సైన్‌ ప్రాంతంలో విజయోత్సవాలు నిర్వహించారు. అందుకు భారీ వేదిక, ప్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపకపోయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది ప్రచార సభలు నిర్వహించారు. ప్రచారం చేసిన చోట మధ్య మధ్యలో వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై మోదీ వైఫల్యాలను ఎండగట్టే వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. అప్పట్లో రాజ్‌ ఠాక్రే చెప్పిన ‘లావ్‌రే తో వీడియో’ (ఆ వీడియో ప్రదర్శించండి) అనే డైలాగ్‌ ఫేమస్‌ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసాద్‌ లాడ్‌ మద్దతుదారులు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై ఎమ్మెన్నెస్‌ను పరోక్షంగా కించపరిచాలనే ఉద్ధేశంతో ‘లావ్‌రే తో ఫటాకే, వాజవ్‌రే ఢోల్‌’ అనే వ్యాఖ్యలు రాశారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వారు వెళ్లిపోయిన తరువాత కొద్దిసేపటికే లాడ్‌కు బెదిరింపు ఫోన్లు రావడం మొదలయ్యాయి. దీంతో ఆ ఫోన్లు ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలే చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Maharashtra News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top