అగ్నిమాపక రోబో!

fire robots - Sakshi

కొనుగోలు చేయాలని బీఎంసీ నిర్ణయం

డ్రోన్లను సైతం వాడాలని యోచన

సాక్షి, ముంబై : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి ప్రాణహాని జరగకుండా రోబోలు కొనుగోలు చేయాలని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) భావిస్తోంది. అలాగే కెమికల్‌ ఫ్యాక్టరీలలో రసాయనాలకు మంటలు అంటుకున్నప్పుడు అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో సిబ్బందికి ప్రాణహాని జరిగే ఆస్కారముంటుంది. ఇలాంటి సమయంలో రోబోలు ఎంతో దోహదపడతాయని బీఎంసీ భావిస్తోంది. అదేవిధంగా అగ్ని ప్రమాద తీవ్రత తెలుసుకునేందుకు డ్రోన్ల సాయం కూడా తీసుకోవాలని యోచిస్తోంది.

డ్రోన్ల అనుమతికి చర్చలు..
బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటు మంటల తీవ్రతకు సంఘటన స్థలానికి దగ్గర వరకు వెళ్లలేక.. అటు అందులో చిక్కుకున్న వారిని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తుంది. దీంతో అనేక సందర్భాలలో అగ్నిమాపక సిబ్బంది గాయడటం లేదా చనిపోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. వీటికి స్వస్తి చెప్పాలంటే రోబోలు ఎంతో ఉపయోగపడతాయని బీఎంసీ భావిస్తోంది. రాత్రివేళల్లో పైఅంతస్తుల్లో మంటలు అంటుకున్నప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. ఒక పక్క చీకటి, మరోపక్క లిఫ్టులు పనిచేయవు. దీంతో ప్రమాదస్థలికి దగ్గర వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది.

అలాంటి సమయంలో ప్రమాద తీవ్రతను గుర్తించి ఆ ప్రకారం వ్యూహాత్మక చర్యలు చేపట్టేందుకు డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ముంబైలో డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు. అందుకు విమానయాన శాఖ, ముంబై పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై వివిధ కోణాల్లో చర్చలు జరుపుతున్నారు. అనుమతి లభించగానే డ్రోన్లు కొనుగోలు చేయడానికి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అగ్నిమాపక శాఖ చీఫ్‌ ప్రభాత్‌ రహందళే చెప్పారు. అందుకు అగ్నిమాపక శాఖకు రూ.151 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. కాగా, అగ్నిమాపక సిబ్బందికి రూ.30 లక్షల బీమా పాలసీ, విధినిర్వహణలో మృతి చెందిన జవాన్ల పిల్లల చదువులకయ్యే ఖర్చు బీఎంసీ భరించనుందని ఆయన అన్నారు.

Read latest Maharashtra News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top