అమ్మను ఓ అయ్య చేతిలో పెట్టింది

special  story on  Krishna Gopal Gupta - Sakshi

నాన్న హఠాత్తుగా చనిపోయారు. అమ్మ ఒంటరి అయింది.  పిల్లలు ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ ఒంటరితనం పోయేది కాదు. అందుకే ఆ కూతురు అమ్మకు ఒక తోడును వెతికి తెచ్చింది. పెళ్లి చేసింది. తల్లిని ఓ అయ్యచేతిలో పెట్టింది. 

‘సంహిత మీరేనా’ అడిగాడు, అడ్రస్‌ వెతుక్కుంటూ జైపూర్‌ వచ్చిన కృష్ణ గోపాల్‌ గుప్తా. 

‘అవును, రండి కూర్చోండి’ అంటూ అతడిని ఆహ్వానించి సోఫా చూపించింది పాతికేళ్ల సంహిత. 

‘‘మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో మీ అమ్మగారి  కోసం మీరు పెట్టిన వివరాలన్నీ చదివాను. నాకు సమ్మతమే. నాకు యాభై ఐదేళ్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ని’’ అని నేరుగా విషయంలోకి వచ్చేశాడతడు.

‘ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మేమసలు ఊహించనే లేదు. అంతా హటాత్తుగా జరిగిపోయింది. ఆరోగ్యంగా ఉన్న మా నాన్నగారు ఉన్నట్లుండి పోయారు’.. అంది సంహిత. 

‘భవిష్యత్తు ఎటు నడిపిస్తుందో ఊహించలేం. దేవుడు నిర్ణయిస్తాడు, తాననుకున్న దారిలో మనల్ని నడిపిస్తాడు... మనం నడుస్తాం అంతే’ అన్నాడతను. 

ఇలాంటి పరిణతి ఉన్న వ్యక్తి కోసమే సంహిత ఎదురు చూసింది. ఇతడి సహచర్యంలో తల్లి దుఃఖానికి దూరం కాగలుగుతుంది అనుకుంది.  

తర్వాత కొద్దిరోజులకే.. గత డిసెంబర్‌ మూడవ తేదీన ఆర్యసమాజం సంప్రదాయంలో గీతకు (సంహిత తల్లి), కృష్ణగోపాల్‌కూ పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల నుంచి నాలుగు వందల మంది మిత్రులు, బంధువులు హాజరయ్యి దంపతులను అభినందనలు తెలిపారు. అంతకంటే ఎక్కువగా సంహిత చొరవను ప్రశంసలతో ముంచెత్తారు.

సంహిత గుర్‌గావ్‌లో ఉద్యోగం చేస్తోంది. తల్లి ఎలా ఉందో చూడ్డానికి రెండు వారాలకోసారి జైపూర్‌ వచ్చి వెళుతోంది. 
– మంజీర




 

Read also in:
Back to Top