ఈ క్షణం కోసమే నేను బతికుంది.. | Russian Couple Anna And Boris Love Story | Sakshi
Sakshi News home page

ఆ ప్రేమికులు కలవటానికి అరవై సంవత్సరాలు పట్టింది

Oct 14 2019 4:41 PM | Updated on Oct 14 2019 5:10 PM

Russian Couple Anna And Boris Love Story - Sakshi

అన్నా, బోరిస్‌(యవ్వనంలో ఉ‍న్నప్పటి ఫొటో)

ఈ క్షణం కోసమే నేను బతికుంది. దేవుడు నాకు పెద్ద...

ప్రేమ అంటే  ఆనందం మాత్రమే కాదు నిత్యచలన సంగీతం. అబ్బురపరిచే  అద్భుతం. అది  సరికొత్త ఊహాలోకాలకు ప్రాణం పోస్తుంది. ఊహకు కూడా అందని విషయాలను నిజం చేసి ఆహా అనిపించి ఆశ్చర్యపరుస్తుంది... దీనికి నిలువెత్తు ఉదాహరణ అన్నా, బోరిస్‌ల ప్రేమకథ! బొరొయంక... రెబ్రింక్‌స్కై(రష్యా) జిల్లాలోని అందమైన గ్రామీణ ప్రాంతం. సుదీర్ఘ కాలం తరువాత సొంత ఊరుకు వచ్చింది అన్నా. తన కుటుంబం ఒకప్పుడు నివసించిన ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంట్లో ఆమెను రకరకాల జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఆ ఇంట్లోనే తన కలల రాకుమారుడు బోరిస్ గురించి తీయటి కలలు కన్నది. ఆ ఇంట్లోనే తన భవిష్యత్ చిత్రపటానికి ఇంద్రధనస్సుల రంగులు అద్దుకున్నది. ఆ ఇంట్లోనే తమ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. బోరిస్ రెడ్ ఆర్మీలో పనిచేసేవాడు.  మరోవైపు అన్నా కుటుంబాన్ని ప్రభుత్వం ‘వర్గ శత్రువు’గా ప్రకటించింది. దీంతో సొంత  ఊళ్లోనే అన్నా కుటుంబం అనాథ అయిపోయింది. అన్నాను పెళ్లి చేసుకోవద్దని సన్నిహితులు వారించినా వెనక్కి తగ్గలేదు బోరిస్. పై అధికారుల ఆదేశాల మేరకు పెళ్లైన మూడు రోజులకే రెడ్ ఆర్మీలో విధులు నిర్వహించడానికి బయలుదేరాడు బోరిస్. అన్నా కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఇక బోరిస్ మనసులో అయితే కన్నీటి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి.

60 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో బోరిస్‌, అన్నాలు 
‘ఈ ఎడబాటు కోసమేనా నేను పెళ్లి చేసుకుంది’ అనే చిన్నపాటి వైరాగ్యం ఒకవైపు కలవర పెట్టింది. అంతలోనే ‘ఈ ఎడబాటు ఎన్ని రోజులని? త్వరలోనే మేమిద్దరం కలుసుకుంటాం’ అనే ఆశ మరోవైపు ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆ ఆశ... నిజం కావడానికి అక్షరాలా అరవై సంవత్సరాలు పట్టింది! పెళ్లి తరువాత మూడో రోజు రెడ్ ఆర్మీలో తిరిగి విధులు నిర్వహించడానికి వెళ్లిన బోరిస్ కొద్దికాలం తరువాత అన్నాను చూడడానికి ఊరికి  వచ్చాడు. ఎంతో ఆశతో వచ్చిన బోరిస్‌కు పిడుగుపాటులాంటి వార్త  తెలిసింది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక అన్నా కుటుంబం... ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని. అన్నా కోసం ఎన్నో చోట్ల వెదికాడు బోరిస్. ‘‘నువ్వు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నావు. అన్నా కుటుంబాన్ని ప్రభుత్వం చంపేసి ఉంటుంది’’ అని కొందరు నిరాశ పరిచారు. ‘‘అలా ఎప్పుడూ జరగదు... అన్నా ఖచ్చితంగా బతికే ఉంది’’ అనేవాడు బోరిస్. అలా ఆశాజనక ఊహలతో అన్నా కోసం సంవత్సరాల నుంచి వేచి చూస్తూనే ఉన్నాడు బోరిస్. 2008 సంవత్సరం. ఊరు గుర్తుకు వచ్చి, అంతకంటే ఎక్కువగా అన్నా గుర్తుకు వచ్చి బొరొయంక వచ్చాడు బోరిస్.

అమ్మానాన్నల సమాధుల దగ్గర నివాళులు అర్పించి అన్నా కుటుంబం నివసించిన ఇంటిని చూడడానికి బయలుదేరాడు. చిత్రమేమిటంటే, సైబిరియాలో ప్రవాసంలో ఉంటున్న అన్నా ఇదే సమయంలో ఊరికి వచ్చింది. పాత ఇంట్లోనే ఉంది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు కావడంతో బయటికి వచ్చింది అన్నా. కారు నుంచి దిగివస్తున్న వ్యక్తి బాగా పరిచయం ఉన్నవ్యక్తిలా కనిపిస్తున్నాడు. బోరిస్ అయితే కాదు కదా...! ‘‘నా పేరు బోరిస్...’’ అని తనను తాను పరిచయం చేసుకోబోతున్నాడు బోరిస్.‘కలా? నిజమా?’ అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది అన్నా. అంతలోనే తేరుకొని ‘‘బోరిస్... నేను అన్నా...’’ అందో లేదో బోరిస్ ఆనందానికి అంతు లేదు. ‘‘ఈ క్షణం కోసమే నేను బతికుంది. దేవుడు నాకు పెద్ద ప్రేమకానుక ఇచ్చాడు’’ అన్నాడు. దుఃఖంతో చాలాసేపటి వరకు వారి మధ్య మాటలు ఘనీభవించాయి. నరక ప్రాయమైన ఏకాంత దీవిలో నుంచి ఇద్దరూ బయటికి వచ్చారు. ఆనందంతో ఇద్దరూ మరోసారి ఒక్కటయ్యారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement