ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయి.. మరొకరిని మనువాడి!! | Try to Elope with Lover But Shraddha Fate Turns Unexpected End | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయి.. మరొకరిని మనువాడి!!

Aug 30 2025 9:10 PM | Updated on Aug 30 2025 9:14 PM

Try to Elope with Lover But Shraddha Fate Turns Unexpected End

ఒక హీరోయిన్‌ ఉంటది. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి పారిపోతుంది. దారిలో కలిసిన హీరోను ఈ ఇద్దరు సాయం కోరతారు. ఆ ప్రయాణంలో హీరోహీరోయిన్ల మధ్య టన్నుల కొద్దీ లవ్‌ పుడుతుంది. చివరకు పాపం ఆ ప్రియుడు కూరలో కరివేపాకులా సైడ్‌ అయిపోతాడు. కాస్త అటు ఇటుగా ఇదే లైన్‌తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. సినిమా వరకు ఇది బాగానే ఉంది.. ఇదే రియల్‌ లైఫ్‌లో జరిగితే!!

వారం రోజులుగా తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఆందోళనలో ఉన్న ఆ తల్లిదండ్రులకు పోలీసులు షాకిచ్చారు. ఓ వ్యక్తిని పెళ్లాడి వచ్చిందని వాళ్లిచ్చిన సమాచారంతో వాళ్లు మరింత గందరగోళానికి గురయ్యారు. పైగా అతను ఆమె ప్రేమించిన వ్యక్తి కాదని.. ఇంకెవరో వ్యక్తి అని చెప్పడంతో మరింత కంగుతిన్నారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ పరిధిలోని ఓ పీఎస్‌లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండోర్‌లో బీబీఏ ఫైనలియర్‌ చదువుతున్న శ్రద్ధా తివారీ ఆగస్టు 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. సీసీటీవీ ఫుటేజీలో.. అర్ధరాత్రి పూట ఆమె కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోయినట్లు రికార్డయ్యింది. దీంతో ఆమెను ట్రేస్‌ చేయడం కష్టతరంగా మారింది. పేరెంట్స్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారంపాటు గాలించారు. అయినా ఆమె జాడ తెలియరాలేదు.

ఈలోపు.. ఇండోర్‌ పీఎస్‌లో శ్రద్ధా ప్రత్యక్షమైంది. తాను సార్థక్‌ అనే యువకుడికి మనసిచ్చానని, పేరెంట్స్‌ అంగీకరించరనే భయంతో అతనితో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నానని పోలీసులు చెప్పసాగింది (పోలీసులు ఊ.. కొట్టసాగారు). అయితే.. సార్థక్‌ స్టేషన్‌కు రాలేదని.. అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడని.. దాంతో గుండెబద్ధలైన తాను ఒంటరిగానే తాను రత్లంకు వెళ్లే రైలు ఎక్కానని తెలిపింది. 

అయితే రత్లం స్టేషన్‌ బయట ఒంటరిగా ఉన్న తనను కరణ్‌దీపక్‌ అనే వ్యక్తి ఓదార్చాడని.. తన పరిస్థితి చెప్పడంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించాడని.. ఇద్దరం కలిసి మాంద్సర్‌లో రైలు దిగి.. మహేశ్వర్‌కు వెళ్లి ఓ గుడి పెళ్లి చేసుకున్నామని.. అక్కడి నుంచి ఓ ఆలయాన్ని సందర్శించుకుని.. నేరుగా ఇక్కడికే వచ్చామని తెలిపింది(పోలీసులు నోర్లు వెల్లబెట్టి వినసాగారు )

అయితే పోలీసులు ఆమె చెప్పింది నమ్మలేదు. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ చూపించాలని కోరారు. అయితే ఆమె ఫొటోలు మాత్రం చూపించింది. ఈలోపు తల్లిదండ్రులకు, సార్థక్‌కు కబురు పంపించారు. శ్రద్ధ తనకు వారం రోజులుగా టచ్‌లో లేదని సార్థక్‌ తేల్చేశాడు.  ఆమె తండ్రి మాత్రం విచిత్రమైన వాదనలు వినిపించాడు. తన కూతురి మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని.. కూతురి ఫొటోను ఇంట్లో తలకిందులుగా వేలాడదీయని ఓ మాంత్రికుడు చెప్పాడని.. పైగా తన కూతురి ఆచూకీ చెబితే రూ.51వేల నజరానా ప్రకటించానని.. అలా చేసినందుకే తన కూతురు తిరిగి వచ్చిందని అంటున్నాడు. అయితే వివాహం జరిగిందనే విషయాన్ని మాత్రం ఆ తండ్రి అస్సలు నమ్మడం లేదు.

కరణ్‌దీప్‌ నాకు ఫోన్‌ చేసి తాను ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నానని, శ్రద్ధ ఆత్మహత్య చేసుకోబోతే ఆపానని చెప్పాడు. ఆ తర్వాత నా కూతురు నాతో ఫోన్‌లో మాట్లాడింది. డబ్బులు అయిపోయానని, పంపిస్తే తిరిగి వస్తానని చెప్పింది. అలా నేను ఆమెకు డబ్బు పంపించా. తీరా ఇప్పుడొచ్చి మేం పెళ్లి చేసుకున్నాం.. కలిసి జీవిస్తామంటే ఎలా నమ్మేది? ఎలా ఒ‍ప్పుకునేది?.. అని అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. 

శ్రద్ధ మేజర్‌(22 ఏళ్లు) కావడంతో ఆమెకు ఇష్టం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని పోలీసులు ఆ తండ్రికి బదులిచ్చారు. దీంతో ఆమె ఎటు పోయినా తమకు సంబంధం లేదంటూ ఆ తండ్రి పీఎస్‌ నుంచి వెళ్లిపోయాడు. అయితే.. శ్రద్ధ చెబుతున్న విషయాలను పోలీసులు ఇంకా నమ్మడం లేదు. ఈ క్రమంలో.. కరణ్‌, శ్రద్ధను కలిపి కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈ ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉండి ఉండొచ్చని, ఆమె సినిమా కథ చెప్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇంతియాజ్‌ అలీ డైరెక్షన్‌లో 2007లో షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా జబ్‌ వీ మెట్‌ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమాలో తన ప్రియుడితో కలిసి పారిపోయిన కరీనా, షాహిద్‌ కపూర్‌లు రత్లం అనే స్టేషన్‌లో అనుకోకుండా దిగిపోతారు. అక్కడి నుంచి సినిమా అసలు మలుపు తిరుగుతుంది. ఇద్దరూ రైలు మిస్‌ అయ్యి.. కలిసి ప్రయాణించే క్రమంలో ప్రేమ బంధంతో ఒక్కటవుతారు. అలా ఈ చిత్రంతో రత్లం స్టేషన్‌కు గుర్తింపు దక్కింది(ఒరిజినల్‌గా షూట్‌ జరిపింది మనాలిలో సెట్‌ వేసి). ఇప్పుడు శ్రద్ధా తివారీ అదే స్టేషన్‌ పేరు చెబుతుండడంతో జబ్‌ వీ మెట్‌ తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement