ప్రేమ చేసిన గాయం మానుతుందా? | Love Failure Story | Sakshi
Sakshi News home page

ప్రేమ చేసిన గాయం మానుతుందా?

Oct 2 2019 6:51 PM | Updated on Oct 30 2019 5:35 PM

Love Failure Story - Sakshi

మా అన్నయ్య పెళ్లిలో మొదటిసారి చూశాను తనని. లవ్‌ అట్‌ ఫస్ట్‌సైట్‌ అంటే ఏంటో అప్పుడే నాకు అర్థమైంది. పెళ్లి అయిపోయేంత వరకు ఆ అమ్మాయి వెంటే తిరిగాను. ఆ రోజు సాయంత్రమే నాకు తెలిసింది.. తను మా వదిన చెల్లెలని, పేరు నవ్య అని. మరుసటి రోజు  ఆమెతో మాటలు కలిపాను. కొద్దిరోజులకే మా ఇద్దరి మధ్యా స్నేహం బాగా పెరిగింది. గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం.  తను మా ఊరు వచ్చినా.. నేను వాళ్ల ఊరు వెళ్లినా ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. వందల సార్లు ఒకరికొకరం ఐలవ్‌ య్యూ చెప్పుకున్నాం. తను నన్ను విడిచి ఒక్కక్షణం కూడా ఉండేది కాదు. ఫోన్లో చాటింగ్‌లు.. గంటల తరబడి టాకింగ్‌లు ఇది మా దైనందిన జీవితం. ఏ చిన్న పండగైనా స్పెషల్‌గా నన్ను గ్రీట్‌ చేసేది.

అప్పుడుప్పుడు నా మీద ప్రేమ కవితలు రాసి పంపేది. నాకెంతో సంతోషంగా అనిపించేది. పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత కొద్దిరోజులకే మా రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కలబడి కొట్టుకునేంత పెద్దవి కావు.. అలాగని మర్చిపోయేంత  చిన్నవి కావు! నివురు గప్పిన నిప్పులాంటివి. బయిటికి బాగా మాట్లాడుతూనే లోపల అన్ని చేసేవాళ్లు. మా ప్రేమ విషయం వాళ్లింట్లో వాళ్లకు తెలిసిపోయింది. నన్ను తనను కలుసుకోకుండా.. ఫోన్లో సైతం మాట్లాడుకోకుండా కట్టుదిట్టం చేశారు. అప్పుడు నాకు ప్రతిక్షణం నరకంలా అనిపించింది. తను లేకుండా నేను బ్రతకలేనని పించింది. ఊపిరి ఆడని క్షణాలు లెక్కనేనన్ని. ఈ బాధకు చావు తప్ప మరో మార్గం లేదు అనిపించేది.

ఓ రోజు వాళ్ల ఇంటికి వెళ్లాను. నా మనసు గాయపడేలా సూటిపోటిమాటలన్నారు! దెప్పిపొడిచారు. తను కూడా చాలా బాధపడింది. తల్లిదండ్రులకు నచ్చజెప్పటానికి ఎంతో ప్రయత్నించింది. వాళ్లు వినలేదు. నా ముందే తనను కొట్టారు. నాకు కోపం వచ్చింది.. కానీ, ఎమీ అనలేని పరిస్థితి. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడినుంచి వచ్చేశాను. మరుసటి రోజు మా అమ్మానాన్నలతో మాట్లాడాను. వాళ్లు కూడా ఒప్పుకోలేదు. పిల్లలకంటే పంతాలే ఎక్కువయ్యాయి పెద్దలకు. ఓ రోజు మధ్యాహ్నం నవ్యనాకు ఫోన్‌ చేసింది. నేను ఒక రకంగా మూగబోయాను.. సంతోషంతో. గొంతు పెకిలించుకుని ఎలాగోలా మాట్లాడాను. కొద్దిసేపటి తర్వాత తను చెప్పిన మాట విని నా గుండె బ్రద్ధలైంది. తల దిమ్మని తిరిగింది. ‘‘ నన్ను మరిచిపో బావా! మా అమ్మానాన్నలను నేను ఇబ్బందిపెట్టలేను. వాళ్లు చూపించిన అబ్బాయినే నేను చేసుకోబోతున్నాను.

పెళ్లి కూడా నిశ్చయమైంది. నన్ను డిస్ట్రబ్‌ చేయకు. బై..’’ చాలా సింపుల్‌గా చెప్పేసింది తను.  ఆ మాటల్ని జీర్ణం చేసుకోవటానికి నా మనసు చాలా కష్ట పడింది. బ్రతుకంటేనే భారంగా అనిపిచింది. ఓ సారి సూసైడ్‌ అటెంప్ట్‌ కూడా చేశాను. మా వాళ్లు నన్ను కాపాడారు. నేను ఆసుపత్రిలో ఉన్నపుడే తన పెళ్లి అయిపోయింది. నేను చావునుంచి బయటపడ్డానన్న సంతోషం నాకు ఏమాత్రం లేదప్పుడు..  ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి శాశ్వతంగా దూరమైందని బాధ తప్ప. తర్వాతినుంచి తన జ్ఞాపకాలు నన్ను నీడలా వెంటాడుతూ వచ్చాయి. ఏ పని చేయబుద్ధికాదు. అన్నం సహించదు. కొద్దిరోజులకే అస్తిపంజరంలా అయ్యాను. నాదో జీవన్మరణ సందేహం.. ప్రేమ చేసిన గాయం మానుతుందా?...

- రాఘవేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement