‘డ్యూటీ చేసినందుకు.. కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు’

Officer Who Checked PM Modi Chopper Would Go To The Court For Justice - Sakshi

సాక్షి, బెంగుళూరు : తన కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు సస్పెన్షన్‌ రూపంలో బహుమానం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ తనిఖీ చేసిన ఐఏఎస్‌ అధికారి మొహమ్మద్‌ మోసిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విధుల మేరకు నడుచుకున్నందుకు నేడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. వివరాలు.. మోదీ మంగళవారం ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తున్న మహ్మద్ మోసిన్ అకస్మాత్తుగా మోదీ ప్రయాణించే హెలికాప్టర్‌లో తనిఖీలు చేపట్టారు. దీంతో మోదీ ప్రయాణం 15 నిమిషాలు ఆలస్యమైంది.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, డీఐజీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. మోసిన్‌ను వారం పాటు సస్సెండ్‌ చేస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. అయితే, ఆయన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించడంతో.. మోసిన్‌ సస్పెన్షన్‌ రద్దు చేసింది. ‘కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి వాహనాలను అనేక సార్లు తనిఖీ చేశారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి వాహనాలను తనిఖీ చేశారు. మరి వారి వాహనాలను తనిఖీ చేసిన అధికారులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు?’... ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను ఏప్రిల్‌ 16వ తేదీన తనిఖీ చేశారన్న కారణంగా మొహమ్మద్‌ మోసిన్‌ అనే ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేయడం పట్ల క్యాట్‌కు చెందిన బెంగళూరు బెంచ్‌ గురువారం ఎన్నికల కమిషన్‌ వర్గాలను ప్రశ్నించింది.

ఎన్నికల సమయంలో ‘ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)’ భద్రత ఉన్న వారి సముచిత భద్రత గురించి ఆలోచించాల్సిందే. అంతమాత్రాన తమ ఇష్టానుసారం నడుచుకునే అధికారం వారికుందని భావించరాదు. ఐఏఎస్‌ అధికారుల బ్లూ బుక్‌ ప్రకారం ఎస్పీజీ పరిరక్షణలో ఉన్న వారి విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయో, వాటి జోలికి మేము పోదల్చుకోలేదు. చట్టం ఎవరికైనా వర్తించాల్సిందే’ అని వ్యాఖ్యానించింది. క్యాట్‌ ఉత్తర్వులతో మోసిన్‌ సస్పెండ్‌ రద్దు కాగా అతను క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాలని ఈసీ స్పష్టం చేసింది.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top