ఊరికి దారేది..?

Where Is The Way Into Village - Sakshi

సాక్షి, సిర్పూర్‌(టి):  మండలంలోని గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లు గుంతలమయమైన ప్రతీ రోజు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఊళ్లలోకి వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయా? అన్న పరిస్థితి నెలకొంది.
 

ఇది పరిస్థితి..
మండలంలోని ఇటిక్యాలపహాడ్‌ గ్రామం మండలకేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా జ్యోతినగర్‌ ప్రధాన రహదారి నుంచి రోడ్డు పూర్తిగా ఇసుకతో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఇటిక్యాలపహాడ్‌ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాల రాకపోకలు కొనసాగడంలేదు. మండలంలోని చీలపల్లి గ్రామం మండలకేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా, రోడ్డు మట్టికొట్టుకుపోయి కంకరతేలడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. లోనవెల్లి గ్రామానికి రోడ్డు వసతి ఉన్నప్పటికీ బీటీరోడ్డు పూర్తిగా కంకరతేలింది. సిర్పూర్‌(టి)–కౌటాల ప్రధాన రహదారి వెంబడి కర్జపల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామం వరకు 4 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. అదేవిధంగా డోర్‌పల్లి గ్రామానికి వెళ్లే 4 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. 
 

అధికారుల నిర్లక్ష్యం..
గుంతలు, మట్టి, ఇసుక రోడ్లతో ప్రతీ రోజు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు చర్యలు చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట అత్యవసర సమయాల్లో గ్రామాల నుంచి మండలకేంద్రానికి, పట్టణాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. 
ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వసతి లేని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 
 

తరుచూ వాహనాల మరమ్మతులు...
మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరుచూ మరమ్మతులు చేయించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఇటిక్యాలపహాడ్‌ గ్రామానికి వెళ్లే రహదారిలో మూడు వాగులు ఉండటంతో వాహనాల్లో ప్రయాణికులను వాహనాల నుంచి దింపి వాగులు దాటిస్తున్నారు. వాగుల్లో వాహనాలు కూరుకుపోవడంతో తరచూ వాహనాలు పాడవుతున్నాయని, దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు.

ఇబ్బందులకు గురవుతున్నాం
లోనవెల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి కంకరతేలింది. మండలంలోని చీలపల్లి, ఇటిక్యాలపహాడ్, డోర్‌పల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులు రోడ్డు వసతి కల్పించాలి. 
– ప్రసాద్, లోనవెల్లి

అధికారులు స్పందించాలి
మండలంలోని గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారులు గుండా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఏళ్లుగా రోడ్డు వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి.
– సురేశ్, సిర్పూర్‌(టి)

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top