rural develepment
-
పంచాయతీ ఎన్నికల జాప్యం.. సంక్షేమానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాత కలుగుతోందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తుచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (2025–26) నివేదికను బుధవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ‘73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఈ(3) ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామపంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక ఆరు నెలల వ్యవధిలోపు పూర్తి చేయాలి. ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాల్సిన రాజ్యాంగపరమైన నిబంధన’ అని కమిటీ పేర్కొంది. ‘‘ పుదుచ్చేరి (2011), కర్ణాటక (2021), మహారాష్ట్ర (2022), మణిపూర్ (2022), లక్షద్వీప్ (2022), అస్సాం(2023), జమ్మూకశ్మీర్ (2023), లద్దాఖ్ (2023)లలో వివిధ కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో 2024 ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా నిర్వహించలేదు’’ అని కమిటీ తెలిపింది. ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వల్ల గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆగిపోయాయని పేర్కొంది. ‘‘ఈ గ్రాంట్లు, నిధులు మంజూరు పంచాయతీలకు సకాలంలో సాకారం అయి ఉంటే ఆయా గ్రామాల ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’’ అని కమిటీ వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగా నిధుల లభ్యత లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల పరిస్థితి మెరుగ్గా లేదని రాష్ట్రాల పర్యటనల్లో తేలినట్లు కమిటీ పార్లమెంట్ దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సత్వరం అత్యున్నత స్థాయి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.‘ఉపాధి’కి నిధులు పెంచాలిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాలని, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘ గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ గ్రామీణ ఉపాధి పథకానికీ కేటాయింపులు తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.86,000 కోట్ల కేటాయింపులు చేశారు. గ్రామాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న గ్రామీణులకు ఉపాధిహామీ పథకం ఇన్నాళ్లూ కీలకమైన రక్షణచట్రంగా నిలిచింది. కరోనా కాలంలో కోట్లాది మంది పేదలను ఈ పథకం ఆదుకుంది. అణగారిన వర్గాలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అవసరం. అందుకే ఈ పథకానికి కేటాయింపులు సమధికంగా పెంచాలి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ ఒత్తిడి తీసుకురావాలి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయం, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోజువారీ వేతన రేట్లు తగిన విధంగా సవరించాలని సూచించింది. -
పల్లెకు పట్టం..రూ.29,271 కోట్ల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సింహభాగం కేటాయించారు. ఈ శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు, కేటాయింపులు, తదితరాలు కలుపుకొని మొత్తం రూ.29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గతేడాదితో పోల్చితే రూ.6,266 కోట్ల మేర అధికం. బడ్జెట్లో పీఆర్, ఆర్డీ శాఖకు భారీగా నిధుల కేటాయింపుతో పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యల్లో భాగంగా గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కార్.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. పల్లెప్రగతి కింద గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు రూ.5,761 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పీఆర్, ఆర్డీ శాఖకు రూ.23,005.35 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది (2019–20)తో పోలిస్తే ఇది రూ.7,880.46 కోట్లు అధికం. ఇక 2021–22 బడ్జెట్లో భాగంగా ప్రగతి పద్దు కింద పంచాయతీరాజ్‌కు రూ.5,433.99 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.10,154 కోట్లు, నిర్వహణ పద్దు కింద పీఆర్‌కు రూ.6,898.08 కోట్లు, ఆర్డీకి రూ.67.13 కోట్లు ప్రతిపాదించారు. 39,36,521 మందికి ‘ఆసరా’ 2021–22 బడ్జెట్లో ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 2019–20లో కేంద్రం ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 6,66,105 కోట్ల మందికి రూ.105 కోట్ల మేర సహాయం అందజేసింది. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.1,816 రాష్ట్ర ప్రభుత్వం జతచేసి, రూ.2,016 పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. వీరే కాకుండా 31,31,660 అసహాయులకు నెలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పూర్తి మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తూ ఆసరా పింఛన్లను అందిస్తోంది. 2019–20 ఆడిట్ నివేదిక ప్రకారం పింఛన్ల పంపిణీలో కేంద్ర వాటా 1.20 శాతం మాత్రమే కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అసహాయులకు జీవన భద్రత కల్పనకు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. ‘పరిషత్’లకు రూ.500 కోట్లు.. బడ్జెట్లో తొలిసారిగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో జెడ్పీలకు రూ.252 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248 కోట్లు ప్రతీ ఏడాది అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనికి అవసరమైన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసి ప్రకటించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి రూ.699 కోట్ల మేర కోత విధించింది. ఈ నేపథ్యంలో గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా నిధులు అందించడంతో పాటు నిరాటంకంగా అభివృద్ధి కొనసాగేందుకు తొలిసారిగా బడ్జెట్‌ను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో మరణించిన వారికి సగౌరవంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు వీలుగా ఇప్పటికే పలు పల్లెల్లో వైకుంఠధామాల నిర్మాణాలు మొదలయ్యాయి. 2021–22 బడ్జెట్లో వైకుంఠధామాల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు ప్రతిపాదించారు. వడ్డీలేని రుణాలకు రూ.3 వేల కోట్లు.. బడ్జెట్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్ల మేర భారీ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అంది స్తున్న సహకారంతో ఈ çస్వయం సహాయక సంఘాలు వృద్ధి చెందడంతోపాటు, వారిలో పొదుపు చైతన్యం సైతం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలో 4,29,262 స్వయం సహాయక సంఘాలుండగా, వాటిలో 46,65,443 మంది సభ్యులున్నారు. వీరంతా పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు పొంది, క్రమం తప్పకుండా తిరిగి చెల్లింపులు చేస్తుండటంతో వారి పరపతి గణనీయంగా పెరిగింది. 2020–21లో మహిళా సంఘాల సభ్యులకు రూ.9,803 కోట్ల రుణాలు వడ్డీలు లేకుండా అందించగా, రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా నిలుస్తోంది. త్వరితంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. -
ఊరికి దారేది..?
సాక్షి, సిర్పూర్(టి): మండలంలోని గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లు గుంతలమయమైన ప్రతీ రోజు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఊళ్లలోకి వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయా? అన్న పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి.. మండలంలోని ఇటిక్యాలపహాడ్ గ్రామం మండలకేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా జ్యోతినగర్ ప్రధాన రహదారి నుంచి రోడ్డు పూర్తిగా ఇసుకతో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాల రాకపోకలు కొనసాగడంలేదు. మండలంలోని చీలపల్లి గ్రామం మండలకేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా, రోడ్డు మట్టికొట్టుకుపోయి కంకరతేలడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. లోనవెల్లి గ్రామానికి రోడ్డు వసతి ఉన్నప్పటికీ బీటీరోడ్డు పూర్తిగా కంకరతేలింది. సిర్పూర్(టి)–కౌటాల ప్రధాన రహదారి వెంబడి కర్జపల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామం వరకు 4 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. అదేవిధంగా డోర్పల్లి గ్రామానికి వెళ్లే 4 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. గుంతలు, మట్టి, ఇసుక రోడ్లతో ప్రతీ రోజు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు చర్యలు చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట అత్యవసర సమయాల్లో గ్రామాల నుంచి మండలకేంద్రానికి, పట్టణాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వసతి లేని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తరుచూ వాహనాల మరమ్మతులు... మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరుచూ మరమ్మతులు చేయించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి వెళ్లే రహదారిలో మూడు వాగులు ఉండటంతో వాహనాల్లో ప్రయాణికులను వాహనాల నుంచి దింపి వాగులు దాటిస్తున్నారు. వాగుల్లో వాహనాలు కూరుకుపోవడంతో తరచూ వాహనాలు పాడవుతున్నాయని, దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ఇబ్బందులకు గురవుతున్నాం లోనవెల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి కంకరతేలింది. మండలంలోని చీలపల్లి, ఇటిక్యాలపహాడ్, డోర్పల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులు రోడ్డు వసతి కల్పించాలి. – ప్రసాద్, లోనవెల్లి అధికారులు స్పందించాలి మండలంలోని గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారులు గుండా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఏళ్లుగా రోడ్డు వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. – సురేశ్, సిర్పూర్(టి) -
బీరేంద్రసింగ్‌కు కేటీఆర్ స్వాగతం
హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌కు మంత్రి కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి, నీటి ఎద్దడిపై కేంద్ర కమిటీ సమీక్ష కోసం ఆయన మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సమీక్షకు మంత్రి కేటీఆర్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.