అమరావతి ఒక విధ్వంసం

Sakshi Special Interview With Varavara Rao - Manasulo Maata

కొమ్మినేని శ్రీనివాసరావుతో విరసం నేత వరవరరావు


అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జరుపుతున్న వ్యవహారం మహా విధ్వంసకరమని విప్లవరచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు విమర్శిం చారు. చంద్రబాబు విధానాలనే కేసీఆర్‌ పాటిస్తున్నారని, ఏ విషయంలోనూ వీళ్లిద్దరికీ తేడా లేదని ఆరోపించారు. రాష్ట్ర సహజవనరులను అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పగించడంలో ఇద్దరు చంద్రులూ ఒకే తానుముక్కలేనని పేర్కొన్నారు. మూడు లక్షల మంది ఆదివాసులను  ముంచేస్తున్న ప్రాజెక్టులు ఎవరి అభివృద్ధిలో భాగమని ప్రశ్నిస్తున్న వరవరరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

రాని విప్లవాల కోసం మీ జీవితాలను అర్పిస్తున్నారే?
రైతు వ్యవసాయం చేయడం మానుకున్నాడా? ఈ ఏడాది పంటపోవచ్చు, వచ్చే ఏడాదీ, ఆ మరుసటి ఏడాదీ పోవచ్చు కానీ రైతు నమ్ముకున్నదే వ్యవసాయాన్నే కదా. ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ నమ్ముకున్నదే వ్యవసాయ విప్లవాన్ని.

ఆప్తులు ఎన్‌కౌంటర్లలో పోతుంటే భయమనిపించదా? 
మానవ సహజ లక్షణాల్లో బాధ ఉంటుంది. నిజానికి క్రిస్టఫర్‌ కాడ్వెల్‌ ‘ఒక కంట్లో కన్నీరు ఉంది కాబట్టి మరోకంట్లో కత్తి మొలిచింది’ అంటాడు. తోటివారి బాధను చూసి కమ్యూనిస్టులు బాధ చెందేటట్లు మరెవ్వరూ చెందలేరు. పార్వతీపురం కుట్రకేసులో ముద్దాయిలపై విచారణ సమయంలో కాళోజీ, నేనూ కోర్టుకు వెళ్లాం. ఆరేడేళ్లుగా జైల్లో ఉన్నవాళ్లను చూసి కాళోజీ కన్నీరు కార్చాడు. ఆ తర్వాత వారే ఉత్తరం రాశారు. ‘కాళోజీ కన్నీళ్లను కత్తులుగా మార్చుకోవడం నేర్చుకో’ అని. ఆ బాధనుంచే జీవితమంతా అంత ఆగ్రహంతో జీవించారాయన. అలాగే పెట్టుబడి, అది చేసే దోపిడీపై మార్క్స్‌ తీవ్ర వేదన చెందారు. మనిషి నెత్తురూ, చెమటా పోసి సరుకును ఉత్పత్తి చేస్తే ఆ సరుకుకే ఆ మనిషి పరాయివాడైపోతున్నాడని బాధ. 

తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఇప్పుడెలా ఉంది?
ఇట్ల ఉంటుందని ఎవరనుకున్నారు అన్నాడు కాళోజీ 1952లోనే. తెలంగాణలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడాలని కోరుకుని ఉద్యమించినవాడు కాళోజీ. శ్రీశ్రీతో కలిసి 1943లోనే వరంగల్‌లో ఆకారం నరసింగరావు తోటలో విశాలాంధ్ర కావాలని సభ పెట్టించి, టాంగాలో పోతుంటే ప్రత్యేక తెలంగాణ వాదులు వారిపై రాళ్లు విసిరారు. అయినా సరే... విశాలాంధ్ర తీర్మానం చేశారు. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడితే విశాలాంధ్ర ఇట్ల ఉంటుందని ఎవరనుకున్నారు అని రాశారు అదే కాళోజీ. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే కాళోజీ ఆరోజు ఇట్లవుతుందని ఎవరనుకున్నారన్నారుగానీ నేటి తెలంగాణ ఇట్లవుతుందనే మేమనుకున్నాం.

కేసీఆర్‌ తెలంగాణ ఇట్లే అవుతుందనుకున్నారా?
బాబు గతంలో చెయ్యంది కేసీఆర్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టీడీపీకి ఇప్పుడు రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని రాశాను. తెరాస ప్రభుత్వంలో 12 మంది టీడీపీకి చెందినవారు మంత్రు లుగా ఉంటున్నారు. నేటి తెలంగాణను ఈ రూపంలో కోరుకోలేదు. బాబు అనుసరించిన ఏ దోపిడీ విధానాలను కేసీఆర్‌ అనుసరించకుండా ఉన్నారో చెప్పండి. అదే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, అదే ప్రపంచబ్యాంక్‌ ఆర్థిక విధానం అమలవుతోందిప్పుడు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలోనే ద్రోహం ఉంది. ఏమిటి ఈ ప్యాకేజీలు? మీకు తెలంగాణను ప్యాకేజీగా ఇస్తాం. వాళ్లకు పోలవరం ప్యాకేజీగా ఇస్తాం. కానీ, మీ ప్యాకేజీల మాయలో ఆదివాసులు 3 లక్షలమందికి పైగా చచ్చిపోతున్నారు అక్కడ. ఏ ప్రజలను కొట్టి ఏ ప్రజలకోసం మీరు ప్యాకేజీలను ఇస్తున్నారు? 

ప్రాజెక్టులే లేకపోతే అభివృద్ధి ఎలా? 
ప్రజలు కోరుకునే పద్ధతిలో ప్రాజెక్టులు ఉండటం లేదు. జల్, జంగిల్, జమీన్‌ మాకు కావాలి అని ప్రజలు కోరుకున్నారు. అధికారం వస్తే జల్‌ని, జంగిల్‌ని, జమీన్‌ని ఏంచేయాలని ప్రజలు నిర్ణయిం చుకోవాలి కానీ మీరెవరు ప్రజలకు ఏది కావాలో నిర్ణయించడానికి? పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తే నేను అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని దాన్ని అడ్డుకుంటాను అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ ఇవ్వాళ ఏమైపోయాడు? నీళ్లు రావు, నెత్తురు పారుతుందన్న అదే కేసీఆర్‌ ఆ ప్యాకేజీమీదే సంతకాలు చేసేసి తెలం గాణ తెచ్చుకున్నాడు. వెంకయ్య, జైరాం రమేష్, చంద్రబాబు ముగ్గురూ చేసిన కుట్ర పథకానికి కేసీఆర్‌ లోబడి ఏడు మండలాలూ వదులుకున్నాడు. ప్రాజెక్టుకూ సమ్మతించిండు. 3 లక్షల మందిని ముంపునకు అర్పించేశాడు. అక్కడితో ఆగకుండా ఇవ్వాళ గోదావరి నదిమీద ప్రాజెక్టుల పేరుతో ఒక్కో ప్రాంతంలో డజన్ల కొద్దీ ఆదివాసీ గ్రామాలను నీళ్లలో ముంచేయబోతున్నారు. 

ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం కాదా?
ఎవరికోసం సస్యశ్యామలం చేస్తున్నారు అనేది ప్రశ్న. లోచన్‌ అనే కవి భాక్రానంగల్, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు ఇప్పుడు పెద్దవాళ్ల ఇళ్లల్లో షవర్‌ బాత్‌ లుగా పనిచేస్తున్నాయని కవిత్వం రాశారు. మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎవరికోసం వస్తున్నాయంటారు? భూమిని పంచకుండా ఈ ప్రాజెక్టులేంటి?

మీ మోడల్‌ ప్రకారం అసలు అభివృద్ధి ఎలా? 
అభివృద్ధి గురించి చీమలను అడగండి. చీమల్లాంటి ప్రజలను అడగండి. అంతే కానీ పాములను అడగొద్దు. పాములకోసం అభివృద్ధి చేయవద్దు. ఆదివాసులను అడగండి. వాళ్ల కాళ్లకింది నేలను లాగేస్తున్న వారిని అడగొద్దు. చీమలనుకున్నవే.. పాములుగా మారుతున్న రోజులివి.  

కేసీఆర్, చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం?
ఇద్దరి ప్రభుత్వాలలో ఏమీ తేడా లేదండి. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం రెండో కొనసాగింపే కేసీఆర్‌ ప్రభుత్వం. బాబు తొమ్మిదిన్నరేళ్ల కొనసాగింపు తర్వాత ఈ నాలుగేళ్ల కొనసాగింపు కేసీఆర్‌ది. ఎన్టీఆర్‌ టీడీపీ నుంచి పుట్టినవాడు కేసీఆర్‌. లాటిన్‌ అమెరికన్‌ పాలనలోని రాక్షసత్వాన్ని అమలు చేసిన దుర్మార్గ పాలన ఎన్టీఆర్‌ది. ప్రపంచీకరణ విధానాలను ఒక రిహార్సల్‌గా అమలు చేసినవారు రాజీవ్‌ గాంధీ, ఎన్టీఆర్‌. కేసీఆర్‌ ఆ విధానాలనే అమలు చేస్తున్నారు. 

మరి చంద్రబాబు పాలనపై..?
ఇక చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి చంద్రబాబు చెప్పుకుంటున్న అమరావతి రాజధాని ఒక భయంకరమైన విధ్వంసం. రాజకీయం అనే భావననే భ్రష్టుపట్టించింది చంద్రబాబు కాగా సరిగ్గా ఆ విధానాలనే కేసీఆర్‌ పాటిస్తున్నాడు. ఏ విషయంలోనూ వీరిద్దరికీ తేడా లేదు.

రైతు బంధు అని కేసీఆర్‌ తీసుకొచ్చాడు కదా?
నమ్మక ద్రోహం ఇది. ఏ రైతులకు ఇస్తున్నాడు, భూమ్మీద సేద్యం చేసే రైతులకు ఇచ్చాడా, సేద్యం చేయని భూ యజమానులకు ఇచ్చాడా.

Read latest Interview News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top