ప్రపంచంలోనే ధనవంతుడు మృతి! నిజమెంత?

Viral Photo of World Richest Man Funeral is a Fake - Sakshi

సాక్షి, ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కువైట్‌కు చెందిన నాస్సి అల్‌ ఖార్కి మృతి చెందాడన్న పోస్ట్‌ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతో ఆస్తి, బంగారం, నగదు, వజ్రాలు ఉన్నా అతను తనతోపాటు ఏ ఒక్కటీ తీసుకెళ్లలేకపోయాడన్నది ఆ పోస్ట్‌ సారాంశం.  బంగారంతో చేసిన శవపేటికలో అతని మృతదేహం ఉండగా, బంగారు మంచాలు, పచ్చలు, వజ్రాలు, ఇంట్లో బంగారు మెట్లు, బంగారు బాత్రూం వంటివి చూపిస్తూ దాదాపు తొమ్మిది ఫోటోలను ఈ పోస్ట్‌కు జోడించారు. అయితే ఇదంతా అబద్ధమని తేలింది.

బంగారు శవపేటికలో ఉన్న వ్యక్తి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశానికి చెందిన మిలీయనీర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి షెరాన్‌ సుఖేడో(33)గా గుర్తించారు. ఇతను కాల్పుల్లో చనిపోగా, అంత్యక్రియలకు ముందు లక్ష డాలర్లకు సమానమైన బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయిచ కూడా.. ఇక, నాస్సి అల్‌ ఖార్కి అనే వ్యక్తి పేరుతో కువైట్‌లో ఎవరూ లేరు. నాస్సి అల్‌ ఖరాఫీ అనే వ్యక్తి కువైట్‌లో 2011లో ఫోర్బ్స్‌ పత్రికలో ధనవంతుడిగా నమోదయ్యాడు. ఖరాఫీ అదే సంవత్సరం చనిపోయాడు. ప్రస్తు‍తం కువైట్‌లో అత్యంత ధనవంతుడిగా 2019 ఫోర్బ్స్‌ పత్రిక ప్రకారం కుతాబయా అల్ఘానిమ్‌ ఉన్నాడు. 

వేర్వేరు ఫోటోలను ఒక దగ్గర పేర్చి ఒకే వ్యక్తికి చెందినవిగా చూపిస్తూ వైరల్‌ అయిన ఈ పోస్ట్‌ను సూరజ్‌ కిరణ్‌ ట్రావెల్స్‌ అనే ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో మొదట పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ నిజమని నమ్మిన చాలామంది యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. అంతేకాక, జెట్‌ విమానం, వజ్రాల కారు, బంగారు కడ్డీలకు సంబంధించిన ఫొటోలు వేర్వేరు వెబ్‌సైట్ల నుంచి సేకరించారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టుల పట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీదీ నిజమని నమ్మేయకుండా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అసలు ఇప్పుడీ ఈ నిజం ఎలా బయటపడిందంటే అంతర్జాలంలో ఏదైనా ఒక ఫొటో కానీ, వీడియో కానీ పెడితే దాన్ని ఎవరు, ఎప్పుడు పోస్ట్‌ చేశారు? ఆయా ఫోటోలు, వీడియోలు ఎక్కడివి అనేవి తెలుసుకునే రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్ అనే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా వాస్తవ పరిస్థితులను నిర్ధారణ చేసుకోవచ్చు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top