కోవిడ్‌: చైనా రాయబారికి అమెరికా నోటీసులు!

US Summons Chinese Envoy Over Covid 19 Spread Beijing Comments - Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను అమెరికా సైనికులే చైనాలో వ్యాప్తి చేసి ఉంటారన్న చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ ట్వీట్‌పై అగ్రదేశం మండిపడింది. లిజియన్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తమ దేశంలోని చైనా రాయబారి సుయీ టియాంకాయికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తక్షణమే తమతో భేటీ కావాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అమెరికా ఆసియా వ్యవహారాల దౌత్యవేత్త డేవిడ్‌ స్టిల్‌వెల్‌ మాట్లాడుతూ.. ‘‘ తన ద్వారా ప్రపంచానికి అంటుకున్న వైరస్‌ గురించిన విమర్శలను చైనా పక్కదారి పట్టించేందుకు ఇలా వ్యవహరిస్తోంది. వైరస్‌ గురించి ముందే చెప్పలేదు. ఇక కుట్రపూరిత సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం వైరస్‌ కంటే ప్రమాదకరం. మేం వీటిని సహించబోం. చైనీయులు, ప్రపంచ జనాభా శ్రేయస్సు దృష్ట్యా నోటీసు ఇచ్చాం’’అని పేర్కొన్నారు.(కరోనా: అమెరికా- చైనా మాటల యుద్ధం!

కాగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ అమెరికా సైన్యాధికారులే మహమ్మారి వైరస్‌ను చైనాలోకి తీసుకువచ్చారంటూ జావో లిజియన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ బోర్డు డైరెక్టర్(సీడీసీ)‌, వైరాలజిస్ట్‌ రాబర్ట్‌ ఆర్‌.రెడ్‌ఫీల్డ్‌ హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో చేసిన ప్రసంగ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన.. అమెరికా ప్రతీ విషయంలో పారదర్శకత ప్రదర్శించాలని చురకలు అంటించారు. ఇక నోటీసులు అందుకోవడానికి ముందు సూయీ.. మెరుగైన భవిష్యత్తు కోసం చైనా అమెరికాతో కలిసి కోవిడ్‌పై పోరాడుతుందని ట్వీట్‌ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మహమ్మారి కరోనా విజృంభన నేపథ్యంలో అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసునని పరోక్షంగా చైనా అధికారిపై విమర్శలు గుప్పించారు. (కరోనా ఎఫెక్ట్‌: అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top