‘గోల్డేన్‌ స్టేట్‌ కిల్లర్’‌కు 11 జీవిత ఖైదులు

US Golden State Killer An Ex Cop Pleads Guilty To 13 Murders - Sakshi

వాషింగ్టన్‌: ముప్పై ఏళ్లుగా వరుస హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ‘గోల్డెన్‌ స్టేట్‌ కిల్లర్‌’గా పిలవబడే అమెరికా మాజీ పోలీసు అధికారి జోసెఫ్‌ జేమ్స్‌ డీ ఏంజెలో సోమవారం తన నేరాలను కోర్టు ముందు అంగీకరించాడు. 13హత్యలు, పదుల సంఖ్యలో అత్యాచారాలు, కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడుతూ మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాను భయభ్రాంతులకు గురి చేసిన జోసెఫ్‌కు సోమవారం కోర్టు శిక్ష విదించింది. విచారణలో అతడు పాల్పడిన భయంకరమైన నేరాలకు సంబంధించిన వివరాలను కోర్టు వెల్లడించింది. జోసెఫ్‌ దాదాపు 30 ఏళ్లుగా నేరాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. 74 ఏళ్ల జోసెఫ్‌ కోర్టు విచారణ సమయంలో తన నేరాలకు సంబంధించి ‘అవును’.. ‘ఒప్పుకుంటున్నాను’.. ‘తప్పే వంటి’ సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో ప్రాసిక్యూటర్ అమీ హాలిడే గతంలో జోసెఫ్‌కు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ.. పెరోల్‌కు అనుమతి లేకుండా 11 జీవిత ఖైదుల శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. 

‘గోల్డెన్‌ స్టేట్‌ కిల్లర్‌’గా పిలవబడే జోసెఫ్‌ను మూడు దశాబ్దాల తర్వాత 2018లో అరెస్ట్‌ చేశారు. నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన డీఎన్‌ఏను జోసెఫ్‌ డీఎన్‌ఏతో పోల్చారు. రెండు మ్యాచ్‌ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి.. మూడు దశాబ్దాలుగా సాగిన నేరాల పరంపరకు ముగింపు పలికారు. మొదట ఇతడికి 1978లో నూతన జంట బ్రియాన్‌, కేటీ మాగ్గియోర్‌ హత్య కేసులో మాత్రమే కోర్టు శిక్ష విధించింది. ఆ తర్వాత 2018 నాటి కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి జోసెఫ్‌ దాదాపు 13 హత్యలు, 50 అత్యాచారాలు, పదుల కొద్ది దొంగతనాలకు పాల్పడ్డట్లు వెల్లడయ్యింది.

న్యాయమూర్తి జోసెఫ్‌ నేరాల చిట్టాను చదువుతూ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఒక అత్యాచారం కేసులో జోసెఫ్‌ బాధితురాలి కొడుకు చెవి కోస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కోర్టు వెల్లడించింది. భారీ వస్తువుతో బాధితుల తలలు పగలకొట్టి హత్యలు చేసేవాడని తెలిపింది. ఇతడి నేరాలు మొదట 1975 సెంట్రల్ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో ప్రాంతంలో ప్రారంభమయ్యి.. తర్వాత రాష్ట్రమంతా వ్యాపించాయి. 1986లో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇదే ఇతడి ఆఖరి హత్య. ఈ క్రమంలో ‘ఈస్ట్ ఏరియా రేపిస్ట్’, ‘డైమండ్-నాట్ కిల్లర్’, ‘ఒరిజినల్ నైట్ స్టాకర్’ వంటి అనేక పేర్లతో జనాల గుండెల్లో భయాందోళనలు రేకెత్తించేవాడు. 1979లో ఓ షాపులో దొంగతానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. దాంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత జోసెఫ్‌ 20 ఏళ్ళకు పైగా సాక్రమెంటో ప్రాంతంలో నివసించాడు. అక్కడ ట్రక్‌ మెకానిక్‌గా పని చేస్తూ.. 2017లో పదవి విరమణ చేశాడు. 

కోర్టు జోసెఫ్‌కు శిక్ష విధిస్తూ.. ‘హత్యగావింపబడిన వారి కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారికి న్యాయం జరగడం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. లైంగిక వేధింపుల బాధితులు న్యాయం కోసం ఇంతకాలం ఎదురు చూడటం విషాదకరం’ అంటూ బాధపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top