ఉత్తర కొరియాకు అమెరికా చెక్
వరుసపెట్టి అణ్వాయుధాలను పరీక్షిస్తూ.. పంటికింద రాయిలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కాస్త భయం నేర్పించాలని అమెరికా భావిస్తోంది.
వరుసపెట్టి అణ్వాయుధాలను పరీక్షిస్తూ.. పంటికింద రాయిలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కాస్త భయం నేర్పించాలని అమెరికా భావిస్తోంది. దాంతో దక్షిణ కొరియాలో వెంటనే థాడ్ యాంటీ మిసైల్ వ్యవస్థను మోహరించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా వాటిని అక్కడ ఏర్పాటుచేస్తామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డేనియల్ రసెల్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలతో ఈ విషయమై అమెరికా సంప్రదింపులు మొదలుపెట్టింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా ఉత్తర కొరియాను అడ్డుకోవాలని వివిధ దేశాలను కోరింది. ఉత్తరకొరియా క్షిపణిపరీక్షల నేపథ్యంలో తాము తప్పనిసరిగా వీలైనంత త్వరలోనే క్షిపణి విధ్వంసక వ్యవస్థను దక్షిణ కొరియాలో ఏర్పాటుచేస్తామని రసెల్ అన్నారు.
సెప్టెంబర్ 9వ తేదీన ఐదోసారి అణుపరీక్ష నిర్వహించిన తర్వాత ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తామని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే థాడ్ వ్యవస్థ గురించిన ఆలోచన అమెరికాకు వచ్చింది. ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపునకు గట్టి మద్దతు ఇచ్చిన చైనా మాత్రం.. థాడ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యక్రమాల గురించి చైనా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, అందువల్ల ఆ దేశంపై ఆంక్షలకు తమ మద్దతు కూడా ఉంటుందని చెప్పిందని రసెల్ అన్నారు. అమెరికా, దాని మద్దతుదారులు జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కలిసి ఉత్తరకొరియా ఆదాయ మార్గాలను కత్తిరించే ప్రయత్నాల్లో పడ్డాయి.


