ఫొటోలు.. వీడియోలు ఉన్నాయి కానీ: అమెరికా

US Defence Secretary Says Can Strike Any Body Any Time Over Baghdadi Death - Sakshi

వాషింగ్టన్‌ : మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు, ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బాకర్‌ అల్‌ బాగ్దాదీని హతమార్చి ఐసిస్‌ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీచేశామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ అన్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పక్కా పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయువ్య సిరియాలో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా మానవ హక్కుల కార్యకర్త కైలా ముల్లర్‌ పేరిట చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో అమెరికా సేనలు బాగ్దాదీని అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మార్క్‌ మాట్లాడుతూ.. పాశవిక దాడులు, హత్యలకు.. నరమేధానికి కారణమైన బాగ్దాదీని హతం చేసే క్రమంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. బాగ్దాదీ అంతం తర్వాత కూడా సిరియాలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని.. కొన్ని బాహ్య శక్తులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

‘సిరియాలో ఐసిస్‌ను ఓడించేందుకు 2014 నుంచి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఐసిస్‌ చర్యలకు అడ్డుకట్ట వేయడంతో అధ్యక్షుడు ట్రంప్‌ సూచనలతో కొన్ని రోజుల క్రితం అమెరికా సేనలు వెనక్కి వచ్చాయి. అయితే ఏరివేయగా అక్కడ మిగిలిపోయిన కొంతమంది ఉగ్రవాదులు మరోసారి విధ్వంసానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సిరియన్‌ డెమొక్రటిక్‌ బలగాలు మాకు సహకరించాయి. దీంతో వాయువ్య సిరియాలో మేము పట్టుబిగించాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.(చదవండి : ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!)

ఇక బాగ్దాదీ హతమైన నేపథ్యంలో జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ అలెగ్జాండర్‌ మిల్లీ మాట్లాడుతూ... బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలెజిన్స్‌, రక్షణ శాఖలు సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. టర్కీ బార్డర్‌లో ఉన్న ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో బాగ్దాదీ జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ‘ ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అమెరికా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వాటిని విడుదల చేయలేము. డీక్లాసిఫికేషన్‌(డాక్యుమెంటేషన్‌ ప్రాసెస్‌) చేసిన తర్వాత భవిష్యత్తులో అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా సైన్యం లక్ష్యం ఎక్కడున్నా.. ఎంత దుర్భేద్యమైనది అయినా దానిని ఛేదించడంలో ఏమాత్రం తడబడదు. టార్గెట్‌ను కొట్టి తీరుతుంది. మా దగ్గర ఎంతో గొప్పదైన సైన్యం ఉంది. ఎవరిపైనైనా.. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా మేము దాడి చేయగలం. కాబట్టి ఉగ్రవాదులంతా అప్రమత్తంగా ఉండండి’ అని హెచ్చరించారు. అదే విధంగా సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు సిరియన్‌ డెమొక్రటిక్‌ బలగాలతో తాము కలిసి పనిచేస్తూనే ఉంటామని మిల్లే స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top