అమెరికాపై రష్యా సైబర్ దాడులు? | US alleges cyber attacks by russia on their political organizations | Sakshi
Sakshi News home page

అమెరికాపై రష్యా సైబర్ దాడులు?

Oct 8 2016 8:27 AM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికాపై రష్యా సైబర్ దాడులు? - Sakshi

అమెరికాపై రష్యా సైబర్ దాడులు?

తమ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రచార వెబ్‌సైట్లపై రష్యా సైబర్ దాడులు చేస్తోందని అమెరికా ఆరోపించింది.

తమ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రచార వెబ్‌సైట్లపై రష్యా సైబర్ దాడులు చేస్తోందని అమెరికా ఆరోపించింది. రష్యా అండతో కొంతమంది హ్యాకర్లు కొన్ని నెలలుగా సైబర్ దాడులు చేస్తున్నారని అమెరికన్ అధికారులు అంటున్నారు. హిల్లరీ క్లింటన్‌ విజయావకాశాలను దెబ్బతీయడానికే ఇలా జరుగుతోందని చెప్పారు. అయితే, రష్యా మాత్రం అసలు ఈ సైబర్ దాడుల విషయంలో తమ హస్తం ఏమీ లేదని స్పష్టం చేసింది.

సైబర్ దాడుల తీవ్రతను, విస్తృతిని బట్టి చూస్తే మాత్రం కేవలం రష్యాకు చెందిన అత్యంత సీనియర్ అధికారులు మాత్రమే ఇలాంటి కార్యకలాపాలు చేయించగలరని అనిపిస్తోందిన అమెరికా ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారి ఒకరు ఈ ప్రకటన చేశారు. నేరుగా రష్యా ప్రభుత్వంపై ఆరోపణలు చేయకపోయినా.. ఈ సైబర్ దాడుల మూలాలు గాలిస్తే మాత్రం ఒక రష్యన్ కంపెనీకి సంబంధించిన సెర్వర్ల నుంచి జరిగినట్లుగా తేలిందన్నారు. అమెరికా ఎన్నికల విధానంలో జోక్యం చేసుకోడానికే ఇలా జరుగుతోందని, అయితే ఈ కార్యకలాపాలను రష్యన్ ప్రభుత్వానికి ఆపాదించే పరిస్థితిలో మాత్రం తామిప్పుడు లేమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అమెరికా రాజకీయ సంస్థలపై తాము సైబర్ దాడులకు పాల్పడ్డామంటూ వచ్చిన ఆరోపణలను రష్యా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెబ్‌సైట్‌పై ప్రతిరోజూ సైబర్ దాడులు వేలాదిగా జరుగుతాయని, వీటి మూలాలు తమకు అమెరికాలోనే కనిపించాయని, అయినా తాము ఏనాడూ వైట్‌హౌస్‌ మీద ఆరోపణలు చేయలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కొవ్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement