నిమిషాల్లోనే కరోనా ఫలితం!

UK To Roll Out Antibody Tests Which Generate Instant Results - Sakshi

సామూహిక పరీక్షలకు సన్నద్ధం

లండన్‌ : కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి రావడంతో నిమిషాల్లోనే ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్‌ టెస్ట్‌లను లక్షల సంఖ్యలో చేపట్టాలని బ్రిటన్‌ యోచిస్తోంది. వ్యక్తి వేలి నుంచి రక్తాన్ని సేకరించి తక్షణమే ఫలితాలను వెల్లడించే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలపై గోప్యంగా నిర్వహించిన ట్రయల్స్‌ విజవంతమయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ల్యాబ్‌లతో కలిసి యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన హోమ్‌ టెస్ట్‌ల్లో కేవలం 20 నిమిషాల్లోనే ప్రాణాంతక వైరస్‌ వ్యక్తికి సోకిందా అనేది తెలిసిపోతుంది. జూన్‌లో నిర్వహించిన మానవ పరీక్షల ఫలితాల్లో ఇది 98.6 కచ్చితత్వం సాధించిందని తేలినట్టు ది డైలీ టెలిగ్రాఫ్‌ పేర్కొంది. ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ అద్భుతమని, దీన్ని ఇంట్లోనే మనం చేయవచ్చని బ్రిటన్‌ ప్రభుత్వ యాంటీబాడీ పరీక్షల కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్‌ రీజియస్‌ ప్రొఫెసర్‌ (మెడిసిన్‌) జాన్‌ బెల్‌ పేర్కొన్నారు.

ఇప్పటివరకూ ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు అనుమానితుల రక్త నమూనాలను పంపడం వాటిని విశ్లేషించి ల్యాబ్‌లు ఫలితం వెల్లడించే యాంటీబాడీ పరీక్షలకే బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రక్రియ రోజుల తరబడి సాగుతుండటంతో తక్షణం ఫలితాలను వెల్లడించే ర్యాపిడ్‌ టెస్ట్‌లవైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ర్యాపిడ్‌ టెస్ట్‌లకు త్వరలో బ్రిటన్‌ ఆమోదముద్ర వేస్తుందనే ప్రచారంతో పెద్దసంఖ్యలో ఈ తరహా మెషీన్లను ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేపట్టారని టెలిగ్రాఫ్‌ తెలిపింది. కోవిడ్‌-19ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ స్ధాయిలను యాంటీబాడీ టెస్ట్‌లు వెల్లడిస్తాయి. అయితే కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఈ వ్యాధి నుంచి భవిష్యత్‌లోనూ వ్యక్తికి ఇమ్యూనిటీని అందిస్తాయా అనేదానిపై స్పష్టత లేదు.

చదవండి : తోపుడు బండిపై శ‌వాన్ని తోసుకెళ్లిన భార్య..

ఇక​ ఈ ఏడాది చివరినాటికి బ్రిటన్‌ అంతటా మాస్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌ డయాగ్నస్టిక్‌ కంపెనీల భాగస్వామ్యంతో కూడిన యూకే ర్యాపిడ్‌ టెస్ట్‌ కన్సార్షియం (యూకే-ఆర్‌టీసీ) నూతన యాంటీబాడీ టెస్ట్‌లను అభివృద్ధి చేశాయి. గత వారం ఉల్ట్సర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 300 మందిపై నిర్వహించిన పరీక్షలో నూతన యాంటీబాడీ టెస్ట్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని యూకే-ఆర్‌టీసీకి చెందిన డాక్టర్‌ క్రిస్‌ హ్యాండ్‌ వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలు 98.6 శాతం కచ్చితత్వం సాధించడం​ శుభవార్తేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది పాటు సాగే ఈ ప్రక్రియను తాము రాత్రింబవళ్లు పనిచేసి 13 వారాల్లోనే సాధించామని తెలిపారు. ప్రజలు ఇంటి నుంచే ఈ పరీక్షలు చేసుకుని ఫలితాలను సెంట్రల్‌ డేటాబేస్‌కు పంపుతారని చెప్పారు. వ్యాక్సిన్‌కు వ్యక్తుల యాంటీబాడీ రెస్పాన్స్‌ను లెక్కగట్టేందుకు మాస్‌ యాంటీబాడీ పరీక్షలు అవసరమవుతాయని, ఈ ప్రణాళికలో భాగంగానే ర్యాపిట్‌ టెస్ట్‌ల ప్రక్రియను అభివృద్ధి చేశామని డాక్టర్‌ హ్యాండ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top