అంతరిక్షంలో అమెరికా స్పేస్‌ కమాండ్‌

Trump launches US Space Command to address new threats - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షంలో దేశ ఉపగ్రహాలకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా స్పేస్‌ కమాండ్‌ను ప్రారంభించింది. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పేస్‌ కమాండ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎవరూ సవాల్‌ చేయలేరు.  అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను స్పేస్‌కామ్‌ కాపాడుతుంది.  అంతరిక్షంలో ఉపగ్రహాలను నిర్వహించడానికి మనకు స్వేచ్ఛ ఉంది.

అదే సమయంలో మన ఉపగ్రహాలకు వ్యతిరేకంగా ప్రయోగించిన వాటిని గుర్తించి.. నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు భూమి, వాయు, సముద్రం, సైబర్‌ భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న యుద్ధ విభాగాల మాదిరిగానే.. స్పేస్‌ కమాండ్‌ విభాగాన్ని కూడా భావించాలి’అని అన్నారు. స్పేస్‌ కమాండ్‌ ప్రతిపాదనకు ఆమోదం లభించిన అనంతరం యునైటెడ్‌ నేషన్స్‌ స్పేస్‌ ఫోర్స్‌ విభాగాన్ని అమెరికా సైనిక దళాలలో ఆరో విభాగంగా ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమవుతుంది. గతంలో ఉన్న స్పేస్‌ కమాండ్‌ విభాగాన్నే పునఃప్రారంభించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top