'నా స్నేహితులంతా దొంగలు.. నేరస్థులే' | The man who beat a drug addiction with yoga | Sakshi
Sakshi News home page

'నా స్నేహితులంతా దొంగలు.. నేరస్థులే'

Jun 13 2016 5:15 PM | Updated on May 25 2018 2:29 PM

'నా స్నేహితులంతా దొంగలు.. నేరస్థులే' - Sakshi

'నా స్నేహితులంతా దొంగలు.. నేరస్థులే'

డ్రగ్స్ బారినపడిన జేమ్స్ జుగునా అనే ఓ కెన్యా యువకుడు తమ దేశంలోని పలు మురికి వాడల్లో ఇప్పుడు చక్కగా యోగా క్లాసులు నేర్పిస్తున్నాడు.

నైరోబీ: రోజువారిపనుల్లో మునిగిపోయే మనిషి తనను తాను నియంత్రించుకుని సమతౌల్యాన్ని ఏర్పరుచుకునేందుకు మంచి ఔషదం యోగా. భారతీయ సంప్రదాయం నుంచి పుట్టిన ఈ కళ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం ప్రశాంతతను మాత్రమే అందించడం కాకుండా ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా ఎంతో బలవంతుడిని చేస్తుంది. ఎన్నో వ్యసనాలను కూడా దూరం చేస్తుంది. సరిగ్గా అదే విషయం కెన్యాకు చెందిన ఓ డ్రగ్స్ బానిస విషయంలో నిరూపితం అయింది. జేమ్స్ జుగునా అనే ఓ కెన్యా యువకుడు తమ దేశంలోని పలు మురికి వాడల్లో ఇప్పుడు చక్కగా యోగా క్లాసులు నేర్పిస్తున్నాడు.

ఒకప్పుడు డ్రగ్స్ కోసం వీధుల వెంటన పిచ్చిపట్టినవాడిలా తిరిగిన అతడు ఓ యోగా మాస్టర్ అవతారం ఎత్తాడు. యోగా తన జీవితాన్ని ఎలా మార్చిందనే విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆ మాటలేమిటో ఒకసారి పరిశీలిస్తే..'నా దృష్టిలో యోగా ఒక మతం కాదు. అది నమ్మినవారికి నమ్మినంత సహాయం చేస్తుంది. నా జీవితం మొత్తాన్ని యోగా మార్చేసింది. యోగా వల్ల నేను డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నా జీవితం పూర్తిగా నా నియంత్రణలో ఉంది. దాదాపు పదిహేనేళ్లపాటు డ్రగ్స్ బారిన పడ్డ నేను విముక్తిని పొందాను. ఒక స్నేహితుడు తనకు యోగా నేర్పించాడు.

ఇప్పుడు అతడిని ప్రతి గురువారం కలుసుకుంటున్నాను. నా చిన్ననాటి స్నేహితులంతా చదువును మద్యలో ఆపేశారు. వారంతా దొంగలుగా.. నేరస్తులుగా మారారు. డ్రగ్స్ బారిన పడినవారికి రోజు చాలా చిన్నదిగా ఉంటుంది. ఆఫ్రికా మొత్తం కూడా యోగాపై అవగాహన కల్పిస్తుండటం చాలా ఆనందాన్నిస్తుంది. ప్రతి వారం దాదాపు 300 యోగా క్లాసులు జరుగుతున్నాయి. కాంఘెమి అనే మురికి వాడల్లో నేను యోగా క్లాసులు నిర్వహిస్తున్నాను. డ్రగ్స్ బాధితుడినైన నేను చివరకు  యోగా కారణంగా విముక్తి పొందడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తుంది' అని అతడు తన అనుభవాలు చెప్పాడు. తన యోగా క్లాసులకు హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి రోగాల భారిన పడిన వారు కూడా వస్తుంటారని అతడు చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement