సూర్యుడు కూడా ‘లాక్‌డౌన్‌‌’!

sun has gone into lockdown - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 930 లక్షల మైళ్ల దూరంలోని సూర్యుడి అంతర్భాగాన నిరంతరం సుడులు తిరిగే మంటలు, ఉపరితలానికి ఎగిసి పడుతుండే అగ్ని జ్వాలలు, సూర్య గోళం చుట్టూ ఆవిష్కృతమయ్యే అయస్కాంత క్షేత్రాలు హఠాత్తుగా తగ్గిపోయాయి. పర్యవసానంగా భూమిపైకి ప్రసరించే పలు రకాల కిరణాల వాడి కూడా తగ్గింది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు భయపడి ప్రపంచ మానవాళి ‘లాక్‌డౌన్‌’లోకి వెళ్లినట్లుగా సూర్యుడు కూడా లాక్‌డౌన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడేమోనని ‘రాయల్‌ ఆస్ట్రానమికల్‌ సొసైటీ’ అధికారులు వ్యాఖ్యానించారు. (లాక్‌డౌన్‌: మరో రెండు వారాలు పొడిగించండి)

450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సూర్యగోళం కాస్త నెమ్మదించడం కొత్తేమి కాదని, దీన్ని ‘సోలార్‌ మినిమమ్‌’గా వ్యవహరిస్తారని రాయల్‌ సొసైటీ అధికారులు వివరించారు. సూర్యుడు తన నిర్దేశిత మార్గంలో సంచరిస్తున్నప్పుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడం కనిపిస్తుందని, అప్పుడు భూమి మీద ప్రసరించే కిరణాల వేడి కూడా  తక్కువగా ఉంటుందని వారు చెప్పారు. ఈసారి కరోనా విజంభించడానికి, సూర్యుడిలో ఈ మార్పు రావడానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. (వైరస్లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి)

సూర్యుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడాన్ని 17వ శతాబ్దం నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేస్తున్నారని వారు చెప్పారు. సూర్యుడిలో మంటలు తగ్గిన చోటు నల్లటి మచ్చగా కనిపిస్తుందని, అలా సూర్యుడిలో పలు మచ్చలు ఏర్పడడం, మళ్లీ అవి కనిపించక పోవడం కూడా సహజమేనని తెలిపారు. సూర్యుడు బాగా నెమ్మదించినప్పుడు భూగోళంపై భారీగా మంచు కురిసిందని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు. బాగా మంచు కురియడాన్ని ‘మంచు యుగం’గా పేర్కొన్నారు. అలా మూడు మంచు యుగాలు ఏర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. మంచు యుగాల సమయంలోనే సముద్రాలు గడ్డ గట్టిపోయి ఖండాలు కలసి పోవడంతో ప్రజలు ఖండాంతర వలసలు పోయారని మానవ నాగరికత చరిత్ర తెలియజేస్తోంది. (తెల్లగా, సూట్కేస్‌‌ సైజ్లో ఉంది)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top