
రియాద్: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. దేశంలో నాలుగు దశాబ్దాల కిందట సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని సోమవారం ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘గత 35 ఏళ్లుగా ఉన్న నిషేధం తొలగడంతో తొలిసారిగా 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది.
దేశ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది మేలిమలుపు కానుంది’ అని సౌదీ సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి అవ్వాద్ అలవ్వాద్ చెప్పారు. దీనిపై సౌదీ చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న సినీ పరిశ్రమకు సర్కారు నిర్ణయం మరింత ఊపునిస్తుందని అభిప్రాయపడింది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయన్న ఛాందసవాదుల ఆందోళనల నేపథ్యంలో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు.