శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు | Sakshi
Sakshi News home page

శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు

Published Fri, Nov 16 2018 3:47 AM

PM Narendra Modi Attends 13th East Asia Summit In Singapore - Sakshi

సింగపూర్‌: ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సభ్య దేశాల మధ్య బహుళ రంగాల్లో సహకారం, సంబంధాలు పరిపుష్టం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్నారు. తూర్పు ఆసియా సమావేశానికి మోదీ హాజరుకావడం ఇది 5వ సారి. ‘సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలతో పాటు బహుళ రంగాల్లో సహకారం పెరగాలని తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్‌)లో నా ఆలోచనలు పంచుకున్నా.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశా’ అని మోదీ ఆ తరువాత ట్వీట్‌ చేశారు. అంతకుముందు, జపాన్‌ ప్రధాని షింజో అబేతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. దానికి ముందు జరిగిన ఆసియాన్‌–ఇండియా అల్పాహార సమావేశంలో మోదీ మాట్లాడుతూ..వ్యూహాత్మక ఇండో–పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని నొక్కిచెప్పారు.  కేడెట్‌ మార్పిడి కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎన్‌సీసీ కేడట్లను కలుసుకున్న మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. మోదీ రెండు రోజుల సింగపూర్‌ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు.

హ్యాకథాన్‌ విజేతలకు సత్కారం..
ఇండియా, సింగపూర్‌ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్‌ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్‌ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐ టీ ఖరగ్‌పూర్, ఎన్‌ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ బృందాలున్నాయి. సింగ పూర్‌ మంత్రి ఓంగ్‌ యే కుంగ్‌తో కలసి మోదీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
 

Advertisement
Advertisement