
వాషింగ్టన్ : పాకిస్థాన్‌పై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయని, ఇందులో తమకు ఏమాత్రం అనుమానం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ చైర్మన్ జనరల్ జోసెఫ్ డన్‌ఫోర్డ్ అన్నారు. విదేశాంగ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన సందర్భంగా సెనేటర్ జో డోన్‌లీ అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. భారత్, అప్ఘనిస్థాన్ ఎప్పటి నుంచో పాక్ కు చెందిన ఐఎస్‌ఐను ఉగ్రవాదులతో సంబంధం ముడిపెడుతున్నాయని, మీరు కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నారా అని జో ప్రశ్నించగా డోన్‌లీ స్పందిస్తూ 'ఉగ్రవాద గ్రూపులతో ఐఎస్‌ఐకు సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టం' అని నిర్మొహమాటంగా చెప్పారు.
అమెరికా గతంలోనే అమెరికా వైఖరిని మార్చేందుకు పలుమార్లు ప్రయత్నించిందని, అయినప్పటికీ అక్కడి ప్రభుత్వ పెద్దలు ఒక మాదిరిగా నిఘా సంస్థ మాత్రం ఒక తీరుగా పనిచేస్తుందని చెప్పారు. ఐఎస్‌ఐ ప్రత్యేక విదేశాంగ విధానం ఉందని కూడా ఆయన ఆరోపించారు. పాకిస్థాన్‌ను మార్చేందుకు మరో మార్గం ఉందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించామని, సరిగ్గా పరిశీలిస్తే స్వయంగా ఉగ్రవాదులను వదిలిపెట్టిన సంఘటనలు కూడా ఎన్నో చూస్తామని తెలిపారు. 'పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పడగొడతామని చెబుతుంది. కానీ, ఐఎస్‌ఐ మాత్రం సొంత విదేశాంగ విధానంతో ముందుకెళ్లడం మనం చూస్తాం' అని ఆయన చెప్పారు.