భారత్‌పై కొత్త రాగం అందుకున్న పాక్‌ మంత్రి

Pakistan Foreign Minister Shah Mahmood Qureshi Call For Talk With India - Sakshi

భారత్‌తో చర్చలకు సిద్ధం: పాక్‌ విదేశాంగ మంత్రి

ఇస్లామాబాద్‌: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితిలు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై పాక్‌ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలా వద్ద అంశంపై రోజుకో కొత్తపాట పాడుతోంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌పై పాక్‌ ప్రభుత్వం కత్తులుదూస్తోన్న విషయం తెలిసిందే. ఇకపై ఏ విషయంలోనూ భారత్‌తో చర్చించేది లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఘంటాపథంగా తేల్చిచెప్పారు. అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా దిగడానికి వెనుకాడబోమని చెప్పకనే చెప్పారు. ఇదిలావుండగా.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి తాజాగా ప్రకటించారు.

భారత్‌తో చర్చలను తామెప్పుడూ నిషేధించలేమని, రెండు దేశాల మధ్య సుధీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరముందని ఖురేషి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుతం గృహ నిర్భందంలో ఉన్న కశ్మీర్‌ నేతలను విడుదల చేయాలని, వారు బయటకు వచ్చిన అనంతరం వారితో కూడా చర్చించేందుకు పాక్‌ సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఇస్లామాబాద్‌లో ఓ​ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయం చాలా సున్నితమైనదని, దీనిపై పాక్‌, భారత్‌, కశ్మరీ ప్రజల మధ్య చర్చలు జరగాలన్నారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top