బాధితుల్లో అధికులు చిన్నారులే కావడంతో తీవ్ర ఆందోళన

Pakistan Doctor With Infected Syringe Allegedly Sparks HIV Outbreak - Sakshi

ఇస్లామాబాద్‌ : ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ చిన్నారుల గురించి ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో తెలీక వారంతా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కూర్చున్నారు. రిపోర్ట్స్‌ నెగిటీవ్‌ అని వస్తే బాగుండు అని దేవుడిని వేడుకుంటున్నారు. కానీ వారు కోరుకున్నట్లు జరగడం లేదు. పరీక్షలు చేసిన ప్రతి ఒక్కరిలో మహామ్మరి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 400 మందిలో హెచ్‌ఐవీ వైరస్‌ లక్షణాలు కనిపించగా.. వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తుంది.

కలుషిత సిరంజి వాడి.. వందలాది మంది చిన్నారులను ప్రాణాంతక హెచ్‌ఐవీ వ్యాధి బారిన పడేలా చేసిన ఈ సంఘటన పాకిస్తాన్‌లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ముజఫర్‌ గంగర్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్వయంగా అతను కూడా హెచ్‌ఐవీ బాధితుడు కావడం గమనార్హం. ఈ వైద్యుడి వద్ద వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్‌ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 400 మందిలో ఈ వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయని.. వారిలో అధికులు చిన్న పిల్లలే అని అధికారులు తెలిపారు.  మరి కొంత మందికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

అభం శుభం తెలియని తమ చిన్నారులకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇక తమ పిల్లలు సాధరణ జీవితాన్ని ఎలా గడుపుతారు.. సమాజం వారిని ఎలా చూస్తుంది అని వాపోతున్నారు. తమ పిల్లలను ఆదుకోవాలని.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. తమ ప్లిలలకు ఈ పరిస్థితి కల్పించిన డాక్టర్‌కు మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. హైచ్‌ఐవీ కేసుల్లో పాకిస్తాన్‌ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. 2017 ఒక్క సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యులు, పేదరికం వంటివి కూడా ఈ వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో.. వైద్యులు ఒకే సిరంజిని అనేక మందికి వినియోగిస్తున్నారు. ఇక ఇంతటి దారుణానికి కారణమైన వైద్యుడు ప్రస్తుతం రటోడెరోకు సమీపంలోని ఓ జైలులో ఉన్నాడు. ఈ విషయం గురించి అతను ‘నాకు హెచ్‌ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజి వాడానని చేస్తోన్న ఆరోపణలు కూడా అవాస్తవం’ అని కొట్టి పారేస్తున్నాడు. ఈ దారుణంపై విచారణ చేస్తున్నట్లు సింధ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రొగ్రామ్‌ ఇంచార్జ్‌ డా. సికందర్‌ మెమన్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top