క‌రోనా: ఒకే రోజులో 70 డ‌బ్బాల కోక్‌, వ‌యాగ్ర డెలివ‌రీ

One Man Deliveries Viagra And 70 Cans Of Coke In Locked Down Brazil City - Sakshi

బ్రసీలియా: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్లకే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఇళ్ల‌లో ఉండే వారికి నిత్యావ‌స‌రాల కొర‌త ఏర్ప‌డటంతో  డెలివ‌రీ బాయ్స్ డిమాండ్ పెరుగుతోంది. అయితే  ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కొంత‌మంది మాత్ర‌మే డెలివ‌రీ బాయ్స్‌గా పనిస్తున్నారు. వారిలో బ్రెజిల్‌కు చెందిన ‘ఎరిక్ థియాగో(22)’ అనే వ్య‌క్తి ఒక‌రు. అయితే ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు నిర్దేశించిన ప‌నిగంటల్లో మాత్ర‌మే ప‌ని చేస్తుంటే.. థియాగో మాత్రం 24 గంట‌లు నిర్విరామంగా ప‌నిచేస్తున్నాడు. (కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!)

బ్రెజిల్‌లో ఇప్ప‌టికే మూడు వేల కేసులు న‌మోదవ్వ‌గా.. 77 మంది మృత్యువాత ప‌డ్డారు. కరోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి బ్రెజిల్ న‌గ‌రంలో 12 మిలియ‌న్ల మంది ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో 22 ఏళ్ల కుర్రాడు థియాగో మాత్రం రోడ్ల‌పై తిరుగుతూ ఇళ్లలో ఉండే వారి కోసం కిరాణ సామాన్లు, కూర‌గాయ‌లు, మందులు వంటి వాటిని డెలివ‌రీ చేస్తున్నాడు. అంతేగాకుండా ముఖానికి మాస్క్ వేసుకోకుండానే ఈ ప‌ని పూర్తి చేస్తున్నాడు. కేవ‌లం హ్యండ్ శానిటైజ‌ర్‌ను తన వద్ద ఉంచుకొని, ప్ర‌తి డెలివ‌రీ త‌ర్వాత శానిటైజ‌ర్‌ను ఉప‌యోగిస్తున్నాడు. కాగా థియాగో ‘రాపి’ అనే మొబైల్ యాప్ ద్వారా త‌న సేవ‌లు కొన‌సాగిస్తున్నాడు. లాటిన్ అమెరికాలో దాదాపు రెండు లక్షల మంది ఈ యాప్ ద్వారా ప‌ని చేస్తున్నారు. (మాంద్యం వచ్చేసింది..)

ఈ విష‌యంపై ఎరిక్ థియాగో ప్ర‌శ్నించ‌గా.. ‘నేను అనారోగ్యానికి గుర‌య్యే వ‌ర‌కు, లేదా ప్ర‌భుత్వం త‌న‌ను బ‌ల‌వంతంగా ఆపే వ‌ర‌కు బైక్పై డెలివ‌రీ చేయ‌డం ఆప‌ను. ఒక‌వేళ నాకు ఆరోగ్యం చెడిపోయిన‌ప్ప‌టికీ ప‌ని చేయ‌డం మాత్రం మానేయను. నేను సంపాదించిన డ‌బ్బులో కొంత నా ఆరోగ్యం కోసం దాచుకుంటాను. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓ క‌స్ట‌మ‌ర్  70 డ‌బ్బాల కోక్, వ‌యాగ్ర ఆర్డ‌ర్ చేశాడు.  ఇందుకు నేను ఏమాత్రం క‌ష్టంగా ఫీల్ అవ్వ‌లేదు. అనుకున్న స‌మ‌యానికి వాటిని డెలివ‌రీ చేశాను. అలాగే కొన్ని సార్లు నాకు విచిత్ర‌మైన ఆర్డ‌ర్లు వ‌స్తుంటాయి.. షాంపులు, వ‌యాగ్ర‌, బ్లీచ్ వంటివి. డిమాండ్‌ను బ‌ట్టి ఓ రోజు ఇంటికి 20 డాలర్లు తీసుకెళ్తాను. కానీ వెంట‌నే  డిమాండ్ మారుతుంది. నేను చేస్తున్న సేవ‌కు ప్ర‌జ‌లు నాకు కృతజ్ఞతలు చెబుతారు. అయితే మిగ‌తా స‌మ‌యాల్లో మా సేవ‌ల‌ను ఎవ‌రూ గుర్తించరు. అయినప్ప‌టికీ నాకు ఎటువంటి బాధ‌ లేదు. ప్ర‌జ‌ల‌కు సహాయం చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా. క‌రోనా నేప‌థ్యంలో నాకు కూడా ఇంట్లోనే ఉండాల‌ని ఉంది. కానీ అది కుద‌ర‌దు’ అంటూ త‌న ఆవేద‌న‌ను పంచుకున్నాడు. (న్యూయార్క్, న్యూజెర్సీలలో భయం.. భయం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top