ట్రంప్‌పై ఆ పబ్లిషర్‌ మండిపాటు..

 NYT Publisher Asks Donald Trump To Reconsider Anti Media Rhetoric - Sakshi

న్యూయార్క్‌ :  మీడియా, పాత్రికేయులపై దాడి ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో న్యూయార్క్‌ టైమ్స్‌ పబ్లిషర్‌ ఏజీ సబెర్గర్‌ స్పష్టం చేశారు. అధ్యక్షుడి మీడియా వ్యతిరేక వైఖరి సరైంది కాదని, ఇది వైరుధ్యాలను పెంచడంతో పాటు దేశానికి ప్రమాదకరమని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇటీవల వైట్‌హోస్‌లో భేటీ సందర్భంగా తాను ఆయనతో ఈ అంశాలపై చర్చించానని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురణకర్త ఓ ప్రకటనలో వెల్లడించారు. తమ ప్రైవేట్‌ భేటీ వివరాలను ట్రంప్‌ తన ట్విటర్‌ ఫాలోవర్లకు వెల్లడించడంతో దీనిపై తాను బహిరంగంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జులై 20న జరగిన ఈ భేటీని బహిర్గతం చేయవద్దని ట్రంప్‌ సహచరులు తనను కోరారన్నారు.

కాగా సబెర్గర్‌తో సమావేశం ఆసక్తికరంగా సాగిందని, మీడియాలో వెల్లువెత్తుతున్న ఫేక్‌ న్యూస్‌పై విస్తృతంగా చర్చించామని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. మీడియాపై విరుచుకుపడుతూ ట్వీట్ల పరంపర సాగించారు. మీడియాపై ట్రంప్‌ ఎదురుదాడి, ఆయన అనుసరిస్తున్న మీడియా వ్యతిరేక వైఖరి నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడితో భేటీకి తాను అంగీకరించానని న్యూయార్క్‌ టైమ్స్‌ పబ్లిషర్‌ చెప్పుకొచ్చారు.

ఫేక్‌న్యూస్‌ అవాస్తవమని తాను ట్రంప్‌తో స్పష్టం చేయడంతో పాటు జర్నలిస్టులను ప్రజల శత్రువులుగా ఆయన ముద్రవేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు జర్నలిస్టులపై దాడులకు ప్రేరేపిస్తాయని, హింసకు దారితీస్తాయని ట్రంప్‌కు తెలిపానని వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top