బాడీ ఫిట్‌నెస్ స్కానర్ వచ్చేసింది! | naked 3d body scanner; scans your body | Sakshi
Sakshi News home page

బాడీ ఫిట్‌నెస్ స్కానర్ వచ్చేసింది!

Apr 15 2016 6:24 PM | Updated on Oct 16 2018 8:34 PM

బాడీ ఫిట్‌నెస్ స్కానర్ వచ్చేసింది! - Sakshi

బాడీ ఫిట్‌నెస్ స్కానర్ వచ్చేసింది!

అమెరికాకు చెందిన నేకెడ్ ల్యాబ్స్ అచ్చం అద్దం లాంటి ‘నేకెడ్ 3డి బాడీ స్కానర్’ను కనిపెట్టింది.

న్యూయార్క్: బాడీ ఫిట్‌నెస్ కోసం జిమ్‌కెళ్లే ఔత్సాహికులు పొట్ట ఎంత తగ్గిందీ, నడుమెంత తగ్గిందీ, ఛాతి ఎంత పెరిగిందీ, తొడలు పెరిగాయా, తగ్గాయా? అన్న అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టేప్ పట్టుకొని నానా హైరానా పడిపోతుంటారు. అంత చేసినా పొట్టపైగానీ, ఛాతిపైగానీ ఏ కండరం ఎంత పెరిగిందో కచ్చితంగా అంచనా వేయలేరు. అలాంటి వారి కోసం అమెరికాకు చెందిన నేకెడ్ ల్యాబ్స్ అచ్చం అద్దం లాంటి ‘నేకెడ్ 3డి బాడీ స్కానర్’ను కనిపెట్టింది.

 మొత్తంగా మన శరీరాకృతి ఎలా ఉందో 360 డిగ్రీల కోణంలో 3డీ స్కాన్ చేసి ఈ పరికరం మనకు చూపిస్తుంది. మనం చేయాల్సిందల్లా స్కానర్‌కు అనుసంధానించిన గుడ్రటి చట్రంపై బట్టలు విప్పేసి కేవలం 20 సెకడ్లు నిలబడాలి. గుడ్రటి చట్రం 360 డిగ్రీలు తిరుగుతుంటే మన శరీర ఆకృతిని పూర్తిగా పరికరం స్కాన్ చేస్తుంది. పొట్టపైనా, ఛాతిపైనే కాకుండా బాడీ మొత్తంగా ఏ ప్రాంతంలో ఏ కండరం ఎంత పెరిగిందో, ఎంత తగ్గిందో ఈ స్కానింగ్‌లో తెలిసిపోతుంది.

 నిన్నటికి, ఈ రోజుకు బాడీలో ఎంత తేడా వచ్చిందో, వారం రోజుల్లో, నెల రోజుల్లో ఎంత తేడా వచ్చిందో కూడా పాత స్కానింగ్ చిత్రాలతో అదే పోల్చి చెబుతుంది. ఇవన్ని పనులను కచ్చితంగా లెక్కేసి చెప్పడానికి ఈ స్కానింగ్ అద్దంలో క్వాడ్ కోర్ ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ పరికరం ఎప్పటికప్పుడు స్కానింగ్ మ్యాప్‌లను నిక్షిప్తం చేయడమే కాకుండా యాప్ ద్వారా మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌పై డిస్‌ప్లే చేస్తుంది. ఎంత శాతం కొవ్వు కరిగిందో, పెరిగిందో  కూడా చూపిస్తుంది. హెచ్చు తగ్గులను సులభంగా గుర్తించేందుకు వాటిని రంగుల్లో డిస్‌ప్లే చేస్తుంది. ఈ స్కానింగ్ ద్వారా మనం ఏ వ్యాయామం ఎక్కువ చేయాలో, ఏదీ తక్కువ చేయాలో కచ్చితమైన అంచనాకు రావచ్చు.

 ఈ పరికరాన్ని అమెరికాలో 499 డాలర్లకు విక్రయించాలని నిర్ణయించామని, ఇప్పుడు బుక్ చేసుకుంటే షిప్పింగ్ మాత్రం 2017లోనే జరుగుతుందని నేకెడ్ ల్యాబ్స్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement