హిందూ కుటుంబం కోసం ఓ ముస్లిం దంపతులు..... | Muslim couple walks miles to feed Hindu family in a violence-hit Valley in srinagar | Sakshi
Sakshi News home page

హిందూ కుటుంబం కోసం ఓ ముస్లిం దంపతులు.....

Jul 12 2016 5:42 PM | Updated on Oct 19 2018 6:51 PM

హిందూ కుటుంబం కోసం ఓ ముస్లిం దంపతులు..... - Sakshi

హిందూ కుటుంబం కోసం ఓ ముస్లిం దంపతులు.....

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న శ్రీనగర్‌లో కర్ఫ్యూ కారణంగా శుక్రవారం నుంచి దుకాణాలన్నీ కూడా మూతపడి ఉండడంతో తిండిలేక అలమటిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.

శ్రీనగర్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న శ్రీనగర్‌లో కర్ఫ్యూ కారణంగా శుక్రవారం నుంచి దుకాణాలన్నీ కూడా మూతపడి ఉండడంతో తిండిలేక అలమటిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో జీలం నదికి ఆవల జవహర్‌లాల్ నగర్‌లో నివసిస్తున్న దివాన్‌చంద్ పండిట్ కుటుంబం ఒకటి. గత రెండు రోజులుగా తినడానికి ఇంట్లో ఏమీలేక ఆ కుటుంబ సభ్యులు పస్తులు ఉంటున్నారు. వారింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న దివాన్‌చంద్ నానమ్మ కూడా నివసిస్తోంది. తమ ధీన పరిస్థితిని గురించి దివాన్‌చంద్ భార్య తన భర్త స్నేహితుడైన ఓ ముస్లిం ఫ్రెండ్ భార్య జుబేదా బేగమ్‌కు సోమవారం ఉదయం ఫోన్ ద్వారా తెలియజేసింది.

ఎలాగైనా సాయం చేస్తానని మాట ఇచ్చిన జుబేదా బేగమ్ ఇంట్లోని సరకులను ఓ సంచిలో సర్దుకొని తన భర్తను తోడ్కొని దివాన్‌చంద్ పండిట్ ఇంటికి బయల్దేరింది. కర్ఫ్యూ కారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆరేడు కిలోమీటర్ల దూరంలోని జవహర్‌లాల్ నగర్‌కు కాలి నడకనే  బయల్దేరారు. మార్గమధ్యంలో పలుచోట్ల భద్రతా బలగాలు నిలదీయగా అసలు విషయం చెప్పి ముందుకు నడిచారు. అక్కడక్కడ సందుల్లో రాళ్లు రువ్వుతున్న సంఘటనలు జరుగుతున్న లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఇద్దరు ముస్లిం భార్య భర్తలు దివాన్‌చంద్ ఇంటికి క్షేమంగా చేరుకున్నారు.

ఓ ముస్లిం కుటుంబం తమ పట్ల చూపిన అభిమానానికి దివాన్‌చంద్ కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు రాల్చారు. ‘దివాన్‌చంద్ భార్య ఉదయమే ఫోన్‌చేసి ఇంట్లో సరుకులు నిండుకున్నాయని, తినడానికి ఏమీలేక పస్తులుంటున్నామని తెలిపింది. ఆమె కుటాంబానికి ఆహారానికి కావాల్సిన సరకులను ఎలాగైనా అందించాలనే ఉద్దేశంతో భర్తతో కలసి కాలినడకన బయల్దేరాను. సకాలంలో వారి ఇంటికి చేరుకుంటామనే భావిస్తున్నాను’ అని జుబేదా బేగం మార్గమధ్యంలో తనను కలసిన ఓ మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఆపద సమయంలో హిందు, ముస్లింలు కుటుంబాలు ఒకరినొకరు ఆదుకునే సంస్కృతి కాశ్మీర్‌లో ఇప్పటికీ కొనసాగుతుందనడానికి ఇదో ఉదాహరణ.

కాశ్మీర్‌లో హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాని వాని పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో శుక్రవారం నుంచి శ్రీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. అనంతరం జరిగిన అల్లర్లలో ఇప్పటికి 30 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు. నగరంలోని 11 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement