174 కోట్లకు రిస్ట్‌ వాచ్‌ వేలం!

Most expensive Wristwatch Sold For Rs 174 crores - Sakshi

న్యూఢిల్లీ : ‘పాటక్‌ ఫిలిప్పీ గ్రాండ్‌ మాస్టర్‌ చిమ్‌’గా వ్యవహరించే అత్యంత క్లిష్టమైన, ఖరీదైన చేతి గడియారాన్ని ‘క్రిష్టీ’ వేలం వేయగా ఓ ప్రైవేటు బిడ్డర్‌ ఏకంగా 24.2 మిలియన్‌ డాలర్ల (దాదాపు 174 కోట్ల రూపాయలు)కు కొనుగోలు చేశారు. జెనీవాలోని డెస్‌ బెర్గూస్‌ నగరంలోని ఫోర్‌ సీజన్‌ హోటల్‌ నుంచి ఓ ప్రైవేట్‌ బిడ్డర్‌ దీనిని కొనుగోలు చేశారు. వాస్తవానికి దీనికి రెండు మిలియన్‌ పౌండ్ల ధర పలక వచ్చని వేలం నిర్వాహకులు అంచనా వేశారు. ఎవరి ఊహలకు అందనంతగా ధర పలకడం ఆశ్చర్యమని, ప్రపంచంలోనే ఇప్పటి వరకు గడియారాల వేలంలో ఇంత ధర పలకడం ఇదే మొదటి సారని, ఇది ప్రపంచ రికార్డని వారు వ్యాఖ్యానించారు.

2017లో హాలివుడ్‌ నటుడు పాల్‌ న్యూమన్‌ తన డెటోనా చేతి గడియారాన్ని వేలం వేయగం 13.5 మిలియన్‌ పౌండ్లకు (దాదాపు 124 కోట్ల రూపాయలు) అమ్ముడు పోయింది. అప్పటికి అదే ప్రపంచ రికార్డు. ఈ పాటక్‌ ఫిలిప్పీ గ్రాండ్‌ మాస్టర్‌ గడియారాన్ని తయారు చేయడం చాలా సంక్లిష్టమట. ఇందులో మరో విశేషముంది. దీని డయల్‌ స్క్రీన్‌ను నలుపులోకి గులాబీ రంగులోకి ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ గడియారం వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బులను చారిటీకే వెళతాయని జెనీవాలోని క్రిష్టీ వేలం సంస్థ యజమాని సబైన్‌ కెగెల్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా డీఎండీగా పిలిచే మజిల్‌ డిజార్డర్‌తో బాధ పడుతున్న రోగులకు వైద్య చికిత్సలు అందించడం కోసం పాటక్‌ ఫిలిప్పీ సహా 50 ఖరీదైన గడియారాలు వేలానికి వచ్చాయని, వాటన్నింటిని దాతలు ఉచితంగా ఇచ్చారని, తాము కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే వేలం వేశామని సబైన్‌ కెగెల్‌ వివరించారు. 174 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బిడ్డర్‌ వివరాలను తెలియజేయడానికి క్రిస్టీ నిర్వాహకులు నిరాకరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top