ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా

Minneapolis protests For George Floyd Killing - Sakshi

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌తో ఇప్పటికే అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో నల్ల జాతీయుడు మృతి పెను దుమారాన్ని రేపుతోంది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్‌ చేసిన పోలీసులు.. చివరికి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. మెడపై మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్‌ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.

ఈ ఘటన అమెరికాలో తీవ్ర నిరసనలకు కారణమైంది. తొలుత మిన్నియాపోలిస్ నగరంలో కొంతమంది యువకులతోతో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. జార్జ్‌ను కొట్టిచంపిన పోలీసులను విధులనుంచి తొలగించినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆరలేదు. నలుగురు పోలీసులను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తన ప్రజానీకం ఆందోళన బాటపడ్డారు. ఈ క్రమంలోనే పరిస్థితి చేదాటిపోవడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయులను ప్రయోగించారు. దీంతో  పౌరుల నిరసన మరింత తీవ్రరూపం దాల్చింది. ఆందోళకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు, భవనాలకు నిప్పుబెట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నారు. మిన్నియాపోలిస్ నగరం అంతా ధర్నాలు, నినాదాలతో అట్టుడిపోతోంది. 


ఇక ఘటనకు సంబంధించిన రిపోర్టింగ్‌ చేస్తున్న ఓ మీడియా ప్రతినిధిని సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలుస్తోంది. ఇక ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం స్పందించక తప్పలేదు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక గవర్నర్‌ను ట్రంప్‌ ఆదేశించారు. (నల్ల జాతీయుడిపై పోలీసుల అమానుష వైఖరి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top