
మసాజో నొనకా
టోక్యో : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాకా మంగళవారం ప్రపంచ రికార్డుకెక్కారు. జూలై 25, 1905న జపాన్‌లోని హొక్కాయ్‌డోలో జన్మించిన మసాజో నూటపన్నెండేళ్ల వయస్సులో ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మసాజో ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు. ఆయన ఎక్కువగా స్వీట్లు తినడానికి ఇష్టపడతారని, వేడి నీళ్ల స్నానం అంటే ఆయనకు మక్కువని వారు తెలిపారు.
ప్రస్తుతం వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రతి రోజూ దినపత్రిక చదువుతారని వెల్లడించారు. స్పెయిన్‌కు చెందిన ఫ్రాన్సిస్కో న్యూజెన్ ఒలివెరా పేరు మీద ఉన్న ప్రపంచరికార్డు ఆయన మరణానంతరం మసాజోకు దక్కింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వయో వృద్ధులు ఉన్న దేశంగా జపాన్ పేరు గాంచింది. తమ దేశంలో దాదాపు 68000 శతాధిక వృద్ధులు జీవిస్తున్నారని జపాన్ ప్రభుత్వం గతంలో వెల్లడించింది.