ఓటమిని అంగీకరిస్తున్నా

MALDIVES PRESIDENT YAMEEN CONCEDES ELECTION DEFEAT IN STATEMENT - Sakshi

అధికార మార్పిడికి ఒప్పుకున్న మాల్దీవుల అధ్యక్షుడు యామీన్‌

తదుపరి అధ్యక్షుడిగా భారత్‌ అనుకూలవాది సోలిహ్‌

కొలంబో: మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు, భార త్‌ విరోధిగా పేరుపడ్డ అబ్దుల్లా యామీన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఎట్టకేలకు అంగీకరించారు. మాల్దీవులతో సాన్నిహిత్యం కోసం భారత్, చైనాల మధ్య పోరు సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఫలితాన్ని యామీన్‌ అంగీకరిం చపోవచ్చన్న సందేహాలకు ఆయన తెరదిం చారు. ‘మాల్దీవుల ప్రజలు వారికి కావాల్సింది నిర్ణయించారు. నేను ఫలితాల్ని అంగీకరిస్తు న్నాను’ అని దేశ ప్రజల్ని ఉద్దేశించి యామీన్‌ ప్రసంగించారు.

ఎన్నికల్లో విజయం సాధించిన విపక్షాల అభ్యర్థి ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ను కలిసి అభినందించానని ఆయన తెలిపారు. 2013లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యామీన్‌ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అభిసంశనకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతల్ని, వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జీల్ని జైలుకు పంపారు. భారత్‌ వ్యతిరేకిగా మారి చైనాతో దోస్తీకి ప్రాధాన్యతని చ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సోలిహ్‌ భారత్‌ అనుకూలవాది పేరుపడ్డారు.  

భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యం
ఆదివారం వెలువడ్డ అధ్యక్ష ఫలితాల్లో మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన సోలిహ్‌కు 58.3 శాతం ఓట్లు దక్కగా.. యామీన్‌కు 41.7 శాతం ఓట్లే వచ్చాయి. సోలిహ్‌ విజయం సాధించారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ మీడియా కూడా ప్రసారం చేయడంతో యామీన్‌ తప్పుకోవడం ఖాయమని ముందుగానే తెలిసిపోయింది.  సోలిహ్‌కు భారత్‌ అభినందనలు తెలిపింది. ‘ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య శక్తుల విజయానికి సంకేతమే కాదు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన అవసరాన్ని ప్రతిఫలించాయి’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

యామీన్‌ను దెబ్బకొట్టిన చైనాతో దోస్తీ
భారత్‌ ఎత్తుగడ పనిచేసింది. పొరుగునే ఉన్న మాల్దీవుల్లో ఈ ఏడాది రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు సైన్యాన్ని పంపకుండా సంయమనం పాటించడం ఇప్పుడు కలిసొచ్చింది. తమ దేశంలో భారత్‌  సైనిక జోక్యం చేసుకుంటే చైనా సహాయం కోరదామన్న  యామీన్‌ పన్నిన వ్యూహం పారలేదు. కొన్ని దశాబ్దాలుగా స్నేహహ స్తాన్ని అందిస్తున్న భారత్‌ను కాదని, చైనాకు దగ్గర కావడమే కాకుండా తమ దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన యామీన్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. చైనా నుంచి 130 కోట్ల డాలర్ల రుణాలు తీసుకోవడంతో దేశం అప్పుల ఊబిలో కూరుకుని ఆర్థిక సంక్షోభంలో పడింది.

దీంతో పాటు మౌలికసదుపాయాలు, ఇతర ప్రాజెక్టులపై చైనా 200 కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసింది. అభివృద్ధి ప్రాజెక్టులను చైనీస్‌ కంపెనీలకు అప్పగించారు. చైనా చేపట్టిన సిల్క్‌రోడ్డు, భారత్‌ వ్యతిరేకిస్తున్న బెల్ట్‌రోడ్డుకు యామీన్‌ మద్దతు ప్రకటించారు. 2013లో అధికా రాన్ని చేపట్టాక  యామీన్‌ తన రాజకీ య ప్రత్యర్థులను ఖైదు చేయడం లేదా ఇతర దేశాలకు ప్రవాసం వెళ్లేలా చేశారు. రాజకీయ వివాదాలు ముదరడంతో ఈ ఏడాది ఫిబ్రవ రిలో అబ్దుల్‌ యామీన్‌ 45 రోజుల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top