
20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపవటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి.
అంతర్జాతీయంగా గతవారం హాంకాంగే హాట్ టాపిక్. స్వయం పరిపాలన కోసం అక్కడ జరుగుతున్న ఉద్యమం తీవ్రమవుతోంది. 20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్‌ని చైనా మెయిన్‌ల్యాండ్‌లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించినా ఉద్యమం చల్లారకపోగా తిరిగిపుంజుకుంది. ఇది మరింత విస్తృతమై పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు వీధుల్లోకొచ్చారు.
దేశం ఒక్కటే, వ్యవస్థలు రెండు..
1997 జూలై 1న బ్రిటన్ హాంకాంగ్‌పై ఆధిపత్యాన్ని చైనాకు అప్పగించింది. హాంకాంగ్ చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్‌కి పాలనాంశాల్లో, కొన్ని ఇతర విషయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానాలు మాత్రం చైనా ప్రభుత్వ అ«ధీనంలోనే ఉంటాయి. చైనా అధ్యక్షుడి పాలనలోనే ఉన్నప్పటికీ.. పరిపాలనలోనూ, ఇతర విధానాల రూపకల్పనలోనూ హాంకాంగ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఈ స్వతంత్రత ప్రధాన భూభాగమైన చైనాకన్నా అధికంగా ఉన్నదనీ, చైనా ప్రజలకన్నా హాంకాంగ్ ప్రజలు ఎక్కువ హక్కులు అనుభవిస్తున్నారనీ చైనా ఆరోపిస్తోంది. అందుకే ఇక్కడి నేరస్తులను చైనా మెయిన్‌ల్యాండ్‌కు అప్పగించేందుకు చట్టసవరణకు చైనా సిద్ధమైంది. హాంకాంగ్ ప్రజలను ఈ చర్య మరింత రెచ్చగొట్టింది. తక్షణమే చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు మొదలయ్యాయి.
పార్లమెంటు ముట్టడి..
జూలైలో ఆందోళనకారులు పార్లమెంటును చుట్టుముట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎట్టకేలకు చట్టసవరణ బిల్లుని చైనా ప్రభుత్వం విరమించుకుంది. ఇంకా... ఈ ఉద్యమాన్ని దొమ్మీలుగా, అల్లర్లుగా భావించొద్దని, అరెస్టు చేసిన ఉద్యమకారులను విడుదల చేయాలని, పోలీసుల హింసాకాండపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు నెరవేరలేదు.