శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స | Sakshi
Sakshi News home page

శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స

Published Thu, Nov 21 2019 4:04 AM

Mahinda Rajapaksa to be Sri Lanka Prime Minister - Sakshi

కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమసింఘే గురువారం బాధ్యతల నుంచి తప్పుకోగానే, మహిందా రాజపక్స ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోతబయ రాజపక్స చేతిలో విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) తరఫున పోటీ చేసిన సాజిత్‌ ప్రేమదాస ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. పార్లమెంట్లో తన ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే తెలిపారు. మహిందా రాజపక్స 2005 నుంచి 2015 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వివాదాస్పద రీతిలో ప్రధానిగా విక్రమసింఘేని తొలగించి మహిందా రాజపక్సను ఆ పదవిలో కూర్చోబెట్టి రాజ్యాంగ సంక్షోభానికి తెరతీశారు.

ఆ తరువాత డిసెంబర్‌లో ప్రధాని పదవికి రాజపక్స రాజీనామా చేశారు. 1970లో తన 24 ఏళ్ల వయసులోనే తొలిసారి శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికై మహిందా రాజపక్స రికార్డు సృష్టించారు. విక్రమసింఘే 1994 నుంచి యూఎన్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయనపై సొంత పార్టీలో అసమ్మతి ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవిని ప్రేమదాసకు అప్పగించాలని పార్టీలోని యువతరం డిమాండ్‌ చేస్తోంది.  

Advertisement
 
Advertisement