
కన్నడ గొత్తిల్లా...?
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నవారు, ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో పని చేస్తున్న వారు ఎక్కువ మందే ఉన్నారు.
బెంగళూరు: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నవారు, ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో పని చేస్తున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. వారంతా ఎక్కువ వరకు ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలు ఏర్పరుకుంటారు. అంతవరకు ఫర్వాలేదు. స్థానిక ఆటోవాళ్లతో మాట్లాడాలన్నా, స్థానిక దుకాణాదారులు, ఇతర చిల్లర వ్యాపారస్థులతో మాట్లాడాలంటే కన్నడ భాషా మాట్లాడడం రావాల్సిందే.
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పుట్టుకొచ్చిందీ ‘కన్నడ గొత్తిల్లా (కన్నడ తెలియదా)’ అనే వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్‌లో ఎక్కువ మంది దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ ప్రొఫెషనల్సే ఉన్నారు. కన్నడ నేర్పాలంటూ ఐటీ మిత్రుల అడగడంతో అనూప్ మైయా ‘కన్నడ గొత్తిల్లా’ పేరిట వాట్సాప్ ను గత నవంబర్‌లో ఏర్పాటు చేశారు. ఆడియో టేపుల ద్వారా కన్నడ నేర్పించడం మొదలు పెట్టడంతో ఇప్పుడిది బెంగళూరులో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇందులో 30 గ్రూపులు, 500 మంది నేర్చుకునేవారు చేరారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్విడ్జర్లాండ్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్స్ కూడా తమ గ్రూపులో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని పొత్తూరులో ఇంజనీరుగా పనిచేస్తున్న అనూప్ తెలిపారు.
కన్నడ బారుతే (కన్నడ తెలుసుకో), కేలు (విను) ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా కూడా కన్నడను సులభంగానే నేర్చుకోవచ్చు. ‘కన్నడలో మాట్లాడు లేదా రాష్ట్రం విడిచిపో’ అంటూ గత అక్టోబర్ నెలలో ఓ మణిపూరి విద్యార్థిపై కొంతమంది భాషాభిమానులు దాడి చేశారనే వార్త సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇతర భాషలవారు కన్నడం నేర్చుకోవడం పట్ల ఆసక్తి పెంచుకోవాడానికి ఈ సంఘటన కూడా కారణం కావచ్చు. ఇతర రాష్ట్రాలవారేకాదు, విదేశీయులు కన్నడ మాట్లాడినా స్థానికులు తెగ సంతోషిస్తారట. వారి సంతోషం కోసమైనా కన్నడ నేర్చుకుంటే పోలా!