జపాన్‌ కొత్త చక్రవర్తిగా నరుహితో 

Japan emperor declares abdication in historic ceremony in Tokyo - Sakshi

టోక్యో: జపాన్‌కు 126వ చక్రవర్తిగా నరుహితో మంగళవారం అర్ధరాత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్రైసెంథమమ్‌ సింహాసనం నుంచి దిగిపోవడంతో జపాన్‌కు నరుహితో తదుపరి చక్రవర్తి అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రాజ్యం జపాన్‌. 59 ఏళ్ల నరుహితో బుధవారం శాస్త్రోక్తంగా సింహాసనాన్ని అధిష్టిస్తారు. కొత్త చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు చేపట్టడంతో జపాన్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచే రీవా (అందమైన సామరస్యం) శకం ప్రారంభమైంది.  నరుహితో చక్రవర్తిగా ఉన్నంతవరకు కాలాన్ని రీవా శకంగా పేర్కొంటారు.

అకిహితో 30 ఏళ్లపాటు జపాన్‌ చక్రవర్తి పదవిలో ఉన్నారు. ఒక చక్రవర్తి పదవి నుంచి తనంతట తాను తప్పుకోవడం జపాన్‌లో గత 200 ఏళ్లలో ఇదే తొలిసారి. పదవి నుంచి దిగిపోయే ముందు ఆయన తన చివరి రాజప్రసంగం చేశారు. జపాన్‌ ప్రజలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  అకిహితోకు వీడ్కోలు పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే వర్షం రావడంతో వేడుకలకు విఘాతం కలిగింది. జపాన్‌ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను పెద్ద తెరలపై వీక్షించారు. అకిహితో చక్రవర్తిగా చాలా బాగా పనిచేశారనీ, కొత్త చక్రవర్తి కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తాడని తాము విశ్వసిస్తున్నామని పలువురు ప్రజలు తెలిపారు. కాగా, కొన్నిచోట్ల రాచరిక వ్యవస్థను వ్యతిరేకించే వారికి, సమర్థించే వారికి మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top