ఖషోగ్గీ హత్య.. మరో ట్విస్ట్‌ | Jamal Khashoggi Murder Case Probe Continues | Sakshi
Sakshi News home page

Nov 13 2018 8:54 PM | Updated on Nov 13 2018 8:57 PM

Jamal Khashoggi Murder Case Probe Continues - Sakshi

ఆ ‘బాస్‌’ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

న్యూయార్క్‌: ‘మీ బాస్‌కు చెప్పండి’.. వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యానంతరం తన పై అధికారికి సౌదీ అరేబియా నిఘా బృందంలోని సభ్యుడొకరు ఫోన్‌లో చెప్పిన మాట ఇది. ‘ఆ బాస్‌’  సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ హత్యోదంతంలో సల్మాన్‌ పాత్ర ఉందనడానికి ఇదే బలమైన ఆధారమని భావిస్తున్నారు.

ఖషోగ్గీ హత్య జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు రికార్డు చేసిన ఆడియో టేపులను టర్కీ నిఘా విభాగం సేకరించింది. వీటిని గత నెలలో అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్‌ గినా హాస్పెల్‌కు అప్పగించింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్‌ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్‌లో కరిగించి మాయం చేశారని టర్కీ ఆరోపించింది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్‌ చంపించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చే ఆధారాలు ఆడియో టేపుల్లో ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు విశ్వసిస్తున్నారు.

ఖషోగ్గి కోసం సౌదీ ప్రభుత్వం పంపించిన 15 మంది సభ్యులు బృందంలో ఒకరైన మహెర్‌ అబ్దులాజీజ్‌ ముత్రెబ్‌ ఒకరు. ఖషోగ్గీ హత్యానంతరం అతడు ఉన్నతాధికారికి ఫోన్‌ చేసి అరబిక్‌లో ‘మీ బాస్‌తో చెప్పండి’ అన్నాడని వెల్లడైంది. భద్రతా అధికారిగా పనిచేస్తున్న ముత్రెబ్‌ తరచుగా సల్మాన్‌తో కలిసి ప్రయాణిస్తుంటాడని అమెరికా అధికారులతో టర్కీ నిఘా అధికారులు చెప్పారు. ఖషోగ్గీని హత్య చేసిన తర్వాత సల్మాన్‌ సన్నిహితులకు అతడు ఫోన్‌ చేసివుంటాడని వెల్లడించారు. అయితే ముత్రెబ్‌ అరబిక్‌లో చెప్పిన మాటలను తర్జుమా చేస్తే మరో అర్థం వచ్చింది. ‘మాకు అప్పగించిన పని పూర్తయింద’నే అర్థం వచ్చేలా అతడు మాట్లాడినట్టు తేలింది.

అమెరికా ఏం చేస్తుంది?
సల్మాన్‌ పాత్రపై అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. సల్మాన్‌ పేరు ప్రస్తావన రాకపోవడంతో దీన్ని గట్టి ఆధారంగా పరిగణించలేకపోతున్నారు. ఖషోగ్గీ హత్యతో తమ యువరాజుకు ఎటువంటి సంబంధం లేదని సౌదీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీ సేకరించిన ఆడియో టేపులను పరిశీలించేందుకు తమ నిఘా అధికారులను అనుమతించాలని కోరింది. ఆడియో టేపులు, టెలిఫోన్‌ కాల్స్‌ డేటాను టర్కీ తమకు నమ్మకమైన దేశాలతో మాత్రమే పంచుకుంది. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు వెలుగులోకి రావడంతో కచ్చితంగా వైట్‌హౌస్‌పై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరబ్‌లో అమెరికాకు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. అంతేకాదు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌తో సౌదీ యువరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు వ్యతిరేకంగా చర్యలకు అమెరికా ఉపక్రమిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదముంది. అయితే ఈ విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ట్రంప్‌ చెబుతున్నారు. సౌదీ యువరాజు సల్మాన్‌కు ట్రంప్‌ అండగా నిలబడతారనే అభిప్రాయాన్ని అమెరికా ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు వ్యక్తపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement