కిరాతంగా జమాల్‌ ఖషోగి హత్య

Jamal Khashoggi Killed - Sakshi

అంకారా‌: ప్రముఖ జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగి(59) హత్యకేసులో సౌదీ అరేబియా ప్రమేయానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సౌదీకి కాబోయే రాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు ఖషోగి హత్యతో సంబంధం ఉందని టర్కీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘యెని సఫాక్‌’ వెల్లడించింది. ఖషోగి హత్య జరిగిన రోజు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌ నుంచి సల్మాన్‌ అనుచరుడొకరు రాజు కార్యాలయానికి నాలుగుసార్లు ఫోన్‌ చేసినట్టు సదరు పత్రిక తెలిపింది. రియాద్‌లో ఉన్నతస్థాయి పెట్టుబడుల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఈ విషయం వెలుగు రావడం గమనార్హం. మరోవైపు ఖషోగి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీస్తామని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌ హామీయిచ్చారు.

‘యెని సఫాక్‌’ వివరాల ప్రకారం...
ఖషోగి తన పెళ్లికి అవసరమైన డాక్యుమెంట్‌ కోసం కాన్సులేట్‌కు వస్తున్నారని తెలుసుకుని 15 మంది సభ్యుల బృందం అక్టోబర్‌ 2న సౌదీ నుంచి ఇస్తాంబుల్‌కు వచ్చింది. ఖషోగి కాన్సులేట్‌లోకి ప్రవేశించగానే ఈ బృందం ఆయనను చుట్టుముట్టింది. ఆయన వేళ్లను నరికేసి, కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కులు చేశారు. సల్మాన్‌ అనుచరుడైన మహెర్‌ ముత్రెబ్‌ కాన్సులేట్‌ నుంచి సౌదీ నిఘావర్గాల ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ అసిరికి నాలుగుసార్లు ఫోన్‌ చేశాడు. మరొక ఫోన్‌ కాల్‌ అమెరికాకు చేశాడు.

ఎంత వరకు నమ్మొచ్చు!
‘యెని సఫాక్‌’  వెల్లడించిన విషయాలను ఎంత వరకు నమ్మొచ్చు అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే టర్కీ సెక్యురిటీ వర్గాల సహాయంలో ఖషోగి హత్యకు సంబంధించిన విషయాలను ప్రభుత్వ అను​​కూల దినపత్రికలు లీక్‌ చేస్తూ వచ్చాయి. కాన్సులేట్‌ బయట వేచివున్న ఖషోగి ప్రియురాలికి ఆనవాలు తెలియకుండా ఉండేందుకే ఆయన మృతదేహాన్ని ముక్కలు చేశారని గత వారమే ‘యెని సఫాక్‌’   వెల్లడించింది. అయితే ఈ విషయంపై అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఎన్నిసార్లు ప్రశ్నించినా సౌదీ అరేబియా అధి​కారుల నుంచి సమాధానం రాలేదు. మహెర్‌ ముత్రెబ్‌.. ఇస్తాంబుల్‌లో ఉన్నారన్న విషయాన్ని కూడా సౌదీ అంగీకరించలేదు. ఖషోగి వచ్చిన సమయంలో ముత్రెబ్‌ కాన్సులేట్‌కు వచ్చిన ఫొటో బయటకు రావడంతో ఆయన అక్కడున్నట్టు తేలింది.

సౌదీ రాజు సంతాపం
మరోవైపు సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ అల్‌సౌద్‌, కాబోయే రాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సోమవారం ఉదయం ఖషోగి కుమారుడి సలా ఖషోగికి ఫోన్‌ చేసినట్టు సౌదీ మీడియా వెల్లడించింది. ఖషోగి మృతి పట్ల వారు సంతాపం ప్రకటించారని తెలిపింది. ఖషోగి మృతదేహం ఎక్కడుందో తమకు తెలియదని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్‌ ఆల్‌-జుబెయిర్‌ చెప్పారు. ఖషోగి హత్య ‘మూర్కపు చర్య’గా ఆయన వర్ణించారు. దీన్ని ఎంతమాత్రమూ సమర్థించబోమని స్పష్టం చేశారు.

ఖండించిన ఐరోపా దేశాలు
ఖషోగి హత్యను జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు ఖండించాయి. ఈ హత్యోదంతంపై తక్షణమే వివరణ ఇవ్వాలని సౌదీ అరేబియాను డిమాండ్‌ చేశాయి. జర్నలిస్టులపై దాడులను సహించబోమని స్పష్టం చేశాయి. సౌదీ ప్రత్యేక దర్యాప్తు బృందం వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరముందన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఆచితూచి స్పందించారు. సౌదీతో ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసు​కోవాలన్న ప్రతిపాదనకు ఆయన అంగీకరించలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top